
Palak Paratha: ఆకుకూరల్లో పాలకూరకు ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో ఐరన్, విటమిన్-ఏ, విటమిన్-సి, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే పాలకూరను నేరుగా కూరగా తినేందుకు పిల్లలతో పాటు కొంతమంది పెద్దలు కూడా ఇష్టపడరు. అలాంటి వారికి రుచికరంగా, కాస్త వెరైటీగా పాలక్ పరోటా చేసి పెడితే తప్పకుండా నచ్చుతుంది. వెల్లుల్లి, పచ్చిమిర్చి, వేయించిన జీలకర్ర, మసాలాల రుచితో ఈ పరోటా బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉంటుంది. దీనిని ఎలా తయారు చేసుకువాలో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* తాజా పాలకూర – 250 గ్రాములు
* గోధుమ పిండి – 2 కప్పులు
* శనగపిండి – 2 టేబుల్ స్పూన్లు
* వెల్లుల్లి – 6 నుంచి 7 రెబ్బలు
* పచ్చిమిర్చి – 2
* అల్లం – 1 టీస్పూన్
* వాము – అర టీస్పూన్
* తెల్ల నువ్వులు – 1 టేబుల్ స్పూన్
* వేయించిన జీలకర్ర పొడి – అర టీస్పూన్
* గరం మసాలా – పావు టీస్పూన్
* ఇంగువ – చిటికెడు
* ఉప్పు – తగినంత
* నెయ్యి లేదా నూనె – అవసరమైనంత
పాలక్ పరోటా తయారీ ఇలా..
ముందుగా పాలకూర ఆకులను శుభ్రంగా కడిగి మరిగే నీటిలో సుమారు ఒక నిమిషం పాటు బ్లాంచ్ చేయాలి. తర్వాత వెంటనే చల్లటి లేదా ఐస్ వాటర్‌లో వేయాలి. ఇలా చేయడం వల్ల పాలకూర రంగు చక్కగా ఆకుపచ్చగా ఉంటుంది. అనంతరం పాలకూరను పచ్చిమిర్చి, అల్లంతో కలిపి మిక్సీలో వేసి ఎలాంటి ముక్కలు లేకుండా మెత్తగా, చిక్కగా పేస్ట్‌లా చేయడం చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో గోధుమ పిండి, శనగపిండి తీసుకుని అందులో మెత్తగా పేస్ట్‌లా చేసుకున్న పాలకూరను , సన్నగా తరిగిన వెల్లుల్లి, వాము, నువ్వులు, ఇంగువ, వేయించిన జీలకర్ర పొడి, గరం మసాలా, ఒక టీస్పూన్ నెయ్యి, ఉప్పు వేసి మృదువుగా, మెత్తగా ఉండేలా కలుపుకోవాలి. అనంతరం పిండిని మూతపెట్టి సుమారు 10 నిమిషాలు పక్కన పెట్టాలి.
తర్వాత పిండిని సమానంగా ఉండేలా ఉండలు చేసుకోవాలి. ఒక్కో ఉండకు కొద్దిగా పొడి పిండి అద్ది పరాటాను తయారు చేసుకోవాలి. ఇప్పుడు పెనాన్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేడి చేసి పరాటాను వేయాలి. ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత మరోవైపు తిప్పాలి. రెండు వైపులా కొద్దిగా నెయ్యి లేదా వెన్న రాసి, గరిటెతో తేలికగా ఒత్తుతూ బంగారు రంగులోకి వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు కాల్చాలి. అంతే.. వేడి వేడి, రుచికరమైన పాలక్ పరోటా రెడీ అవుతుంది. దీన్ని ఇంట్లో తయారు చేసిన వెన్న, తాజా పెరుగు, ఆవకాయ లేదా కారం పచ్చడితో సర్వ్ చేస్తే రుచి అదిరిపోతుంది. పాలకూర తినేందుకు ఇష్టపడని వారు కూడా ఈ వెరైటీ పరాటాను ఇష్టంగా తినే అవకాశం ఉంది.