Reading Time: 2 minutes

చేతులెత్తేసిన గూగుల్ మ్యాప్.. అర్థరాత్రి మమ్ముట్టికి దారిచూపించిన సామాన్యుడు!

Caption of Image.

సినిమాల్లో ఎన్ని ట్విస్టులు చూసినా.. నిజ జీవితంలో ఎదురయ్యే కొన్ని సంఘటనలు మాత్రం వాటన్నింటినీ మించిపోతాయి.  అలాంటి ఆసక్తికరమైన అనుభవం మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టికి ఎదురైంది. అదికూడా అర్థరాత్రి సమయంలోనే.  తమిళనాడులో ఎదురైన ఆసక్తికర సంఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. షూటింగ్ ముగించుకుని కేరళకు తిరుగు ప్రయాణమైన ఆయనను గూగుల్ మ్యాప్ ముప్పుతిప్పలు పెట్టంది.. చివరికి ఓ సాధారణ యువకుడు హీరోలా వచ్చి దారి చూపించడం అందరి  ప్రశంసలు అందుకుంటున్నాడు..

ముప్పుతిప్పలు పెట్టిన గూగుల్ మ్యాప్…

కారైకుడిలో తన కొత్త సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న మమ్ముట్టి, నిర్మాత ఆంటో జోసెఫ్, నటుడు రమేష్ పిషారడి, డ్రైవర్ ఉన్నితో కలిసి కారులో కేరళ బయలుదేరారు. తెల్లవారుజామున సుమారు 3:30 గంటల సమయంలో తిరుపత్తూరు సమీపంలో హైవే మూసివేయడంతో అసలు సమస్య మొదలైంది. ప్రత్యామ్నాయ మార్గం కోసం గూగుల్ మ్యాప్‌ను నమ్ముకున్నా.. అది వారిని పదేపదే అదే ప్రాంతానికి తీసుకెళ్లిందట. దాదాపు గంటపాటు రోడ్లపై తిరిగిన తర్వాత.. ‘మళ్లీ కారైకుడి రూమ్‌కే వెళ్లిపోదాం.. ఉదయానికి రోడ్లు తెరుచుకుంటాయి’ అనుకునే పరిస్థితి వచ్చింది.

హీరోకి దారి చూపించిన సామాన్యుడు..

అయితే అప్పుడే పట్టమంగళం వద్ద ఓ పెట్రోల్ బంక్ కనిపించింది. అక్కడ ఉన్న యువకులను దారి అడిగిన మమ్ముట్టి బృందానికి ‘పాండియన్’ అనే యువకుడు ఎదురయ్యాడు. కారులో ఉన్నది మమ్ముట్టి అని గుర్తించిన అతడు ఆశ్చర్యపోయారు. మీరు మమ్ముట్టి సార్ అని వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు… సెల్ఫీ కోసం ఆగకుండా వెంటనే సహాయానికి ముందుకొచ్చాడు. ‘మీరు నన్ను ఫాలో అవ్వండి’ అంటూ బైక్ స్టార్ట్ చేసి ముందుకు దూసుకెళ్లాడు.

మమ్ముట్టి కారుకు మార్గదర్శకుడిగా..

గూగుల్ మ్యాప్‌కు కూడా అంతుచిక్కని చిన్న దారుల్లో దాదాపు 10 కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణిస్తూ మమ్ముట్టి కారుకు మార్గదర్శకుడిగా నిలిచాడు. చివరకు ప్రధాన రోడ్డుకు చేర్చి.. కేరళ వైపు నేరుగా వెళ్లాలని చెప్పి అక్కడి నుంచి వీడ్కోలు పలికాడు. అయితే పాండియన్ చేసిన సహాయాన్ని మమ్ముట్టి సంతోషం వ్యక్తం చేశారు. కారు దిగిన ఆయన ఆ యువకుడిని ఆప్యాయంగా హత్తుకుని, అతడి ఫోన్ తీసుకుని ఫొటో దిగారు. పేరు అడిగి తెలుసుకున్నారు. రమేష్ పిషారడి సైతం ‘నువ్వు మమ్ముట్టికి దారి చూపించానని చెబితే ఎవరూ నమ్మరు’ అంటూ సరదాగా వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.

సినిమాల్లో హీరోలు ప్రజలను కాపాడుతుంటారు. కానీ ఆ తెల్లవారుజామున తమిళనాడు రోడ్డుపై.. ఓ సాధారణ యువకుడు తన అభిమాన హీరోకే హీరోగా మారాడు. గూగుల్ మ్యాప్ చేతులెత్తేసిన చోట.. పాండియన్ చూపించిన దారి మాత్రం మమ్ముట్టి జీవితంలో ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది…

 

©️ VIL Media Pvt Ltd.