Reading Time: 2 minutes
అతని ఫోన్ కాల్ నా లైఫ్‌నే మార్చేసింది.. అప్పుడు గుర్తించని వాళ్లు.. ఇప్పుడు గౌరవమిస్తున్నారు

మురళీధర్ గౌడ్ సినీ రంగంలోకి ప్రవేశించిన కొత్తలో, ఆయనకు ఎక్కువగా చిన్న చిన్న ఆర్టిస్ట్ పాత్రలు మాత్రమే లభించాయి. రంగస్థలం చిత్రంలో జగపతిబాబు వెనుక, ఆగడు చిత్రంలో మహేష్ బాబు వెనుక కనిపించినప్పటికీ, ఆ చిత్రాల దర్శకులైన సుకుమార్ గానీ, శ్రీను వైట్ల గానీ తనను గుర్తించలేదని ఆయన అన్నారు. ఈ చిన్న పాత్రలు చేసినప్పుడు, తాను కేవలం గుంపులో ఒకరిగా నిలబడేవాడిని అని పేర్కొన్నారు. అయితే, వినవయ్యా రామయ్య అనే చిత్రంలో ప్రకాష్ రాజ్‌ పక్కన కూర్చొని నాలుగు డైలాగులు చెప్పే అవకాశం లభించిందని,  కృష్ణారెడ్డి తీసిన సింధూరపువ్వు సినిమా అప్పట్లో తనకు కొంత అనుభవాన్ని ఇచ్చిందని తెలిపారు. అయినప్పటికీ, ఈ పాత్రలు తనకు ఆశించిన గుర్తింపును తేలేదని మురళీధర్ గౌడ్ అన్నారు. సినిమాలలో అవకాశం లేని సమయంలో మురళీధర్ గౌడ్ సీరియల్స్‌లో చిన్న చిన్న వన్-డే క్యారెక్టర్లు, వన్-సీన్ క్యారెక్టర్లు చేస్తూ జీవనం సాగించారు. నెలలో ఒక వారం, పది రోజులు షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పటికీ, మిగిలిన 20 రోజులు ఖాళీగా ఉండేవారు. ఈ ఖాళీ సమయాల్లో పనిలేదని, తనకు పని కావాలని ఆయన టెన్షన్ పడేవారని గుర్తు చేసుకున్నారు. ఈ ఖాళీ సమయాలను ఆయన రామకృష్ణ మఠంలో గడిపేవారు. ఆ సమయంలోనే తన కెరీర్‌లో ఊహించని మలుపు తిరిగింది.

ఇది కూడా చదవండి : ఏంటీ.. ఈవిడా ఆమె ఒక్కరేనా..!! ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ హాట్ బ్యూటీ ఈ అమ్మడు

ఒక రోజు మురళీధర్ గౌడ్ తన సొంత ఊరికి బస్సులో వెళ్తున్నప్పుడు, ఆయనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది తరుణ్ భాస్కర్ ఆఫీస్ నుంచి అని తెలిసినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. మురళీధర్ తరుణ్ భాస్కర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం అని అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పినప్పుడు, ఫోన్ పడిపోయినంత పని అయ్యిందని ఆయన నవ్వుతూ చెప్పారు. ఆ సమయంలో ఊరికి వెళ్తున్నానని చెప్పాలా వద్దా అని సంశయించినా, అవకాశం చేజారిపోకుండా ఉండేందుకు హైదరాబాద్‌కు దగ్గర్లో ఉన్నానని చెప్పి, తిరిగి వచ్చి ఆడిషన్‌కు హాజరయ్యారట. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన పిట్ట కథలు వెబ్ సిరీస్‌లో ఎక్స్ ఎమ్మెల్యే రామ్ చంద్రయ్య పాత్ర కోసం రామానాయుడు స్టూడియోస్‌లో ఆడిషన్ ఇచ్చి, ఆ పాత్రను సంపాదించారు మురళీధర్ గౌడ్.

ఇది కూడా చదవండి : దొరికేసింది మావ..! అగ్నిపరీక్ష ప్రోమోలో మెరిసిన ఈ అమ్మాయి బయట ఎలా ఉందో చూశారా..

తరుణ్ భాస్కర్ ఇచ్చిన ఈ అవకాశమే మురళీధర్ గౌడ్‌కు డీజే టిల్లు సినిమాలో కీలక పాత్ర లభించేలా చేసింది. డీజే టిల్లు సినిమా తన జీవితాన్ని మార్చిందని, తనకు ఒక ఐడెంటిటీని, పాపులారిటీని ఇచ్చిందని మురళీధర్ గౌడ్ పేర్కొన్నారు. నేను ఒక సినిమా నటుడిని అవ్వాలి, ఒక మంచి పాపులారిటీ ఉన్నటువంటి నటుడిని అవ్వాలి, ఒక ప్రతిభావంతుడైన నటుడు మురళీధర్ గౌడ్ అనిపించుకోవాలి అనే తన కోరికకు డీజే టిల్లు ఒక ఊతం ఇచ్చిందని ఆయన అన్నారు. డీజే టిల్లు తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పులను మురళీధర్ గౌడ్ వివరించారు. పుష్ప సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు సుకుమార్ స్వయంగా తనను గుర్తించి గౌరవంగా పలకరించారని, అంతేకాదు అల్లు అర్జున్‌కు కూడా పరిచయం చేశారని తెలిపారు. అల్లు అర్జున్ కూడా తనను గుర్తుపట్టారని, బహుశా డీజే టిల్లు ద్వారానే తనకు అల్లు అర్జున్‌తో పరిచయం ఏర్పడిందని మురళీధర్ గౌడ్ అభిప్రాయపడ్డారు. ఈ విధంగా, తరుణ్ భాస్కర్, డీజే టిల్లు ద్వారా మురళీధర్ గౌడ్ సినీ రంగంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.

ఇది కూడా చదవండి : ఈ స్టార్ కమెడియన్ గుర్తున్నాడా.? ఆయన కొడుకు ఇప్పుడు ప్రముఖ స్వామిజీ.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.