Reading Time: < 1 minute
Vvs Laxman Reveals Declining Team India Head Coach Offer

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా పనిచేసే అవకాశాన్ని తాను తిరస్కరించినట్లు భారత మాజీ బ్యాటర్, నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) హెడ్ వివిఎస్ లక్ష్మణ్ వెల్లడించారు. 2023 వన్డే ప్రపంచకప్ ముగిసిన అనంతరం, అప్పటి బిసిసిఐ కార్యదర్శి జై షా తనను భారత పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాలని కోరారని లక్ష్మణ్ తెలిపారు. ఆ సమయంలో నియామకం దాదాపు ఖాయమైనప్పటికీ, కొన్ని అనివార్యమైన వ్యక్తిగత కారణాల వల్ల తాను ఆ ఆఫర్‌ను స్వీకరించలేకపోయానని ఆయన వివరించారు. ఈ విషయాన్ని జై షా దృష్టికి తీసుకెళ్లగా, ఆయన తన పరిస్థితులను అర్థం చేసుకున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్ పదవీకాలాన్ని 2024 టి20 ప్రపంచకప్ వరకు పొడిగించడం, భారత్ ట్రోఫీ నెగ్గడం తెలిసిందే. ప్రస్తుతం గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) బాధ్యతలు..
హెడ్ కోచ్ బాధ్యతలు తీసుకోకపోయినా, బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)ని బలోపేతం చేస్తానని బిసిసిఐకి మాట ఇచ్చినట్లు లక్ష్మణ్ తెలిపారు. CoE కేవలం ఆటగాళ్ల గాయాల నయం లేదా ఫిట్‌నెస్ కేంద్రం మాత్రమే కాదని, క్రికెటర్లు అత్యుత్తమ నైపుణ్యాలు సాధించేలా తీర్చిదిద్దే వేదిక అని స్పష్టం చేశారు.

ఆటగాళ్ల ఫిట్‌నెస్, గాయాలపై స్పష్టత..
క్రీడాకారుల కోలుకునే ప్రక్రియపై మాట్లాడుతూ.. మానవ శరీరం ఒక యంత్రం కాదని, నిర్ణీత సమయంలోనే పూర్తి ఫిట్‌నెస్ సాధించడం ప్రతీసారీ సాధ్యం కాదని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. ఆటగాళ్ల గాయాల విషయంలో ఎవరినీ బలిపశువును చేయడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. సీఓఈ, టీమ్ మేనేజ్‌మెంట్, సపోర్ట్ స్టాఫ్ మధ్య నిరంతరం సమన్వయం ఉంటుందని తెలిపారు.