మన దేశంలో జీవించడానికి, ప్రభుత్వ సౌకర్యాలు పొందడానికి ‘భారత పౌరసత్వం’ (Indian Citizenship) అత్యంత కీలకం. అయితే, మన దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ పౌరసత్వం ఒకేలా రాదు. కాలక్రమేణా పౌరసత్వ చట్టాలలో ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేసింది. అవేంటో, ఏ సంవత్సరంలో పుట్టిన వారికి ఎలాంటి నిబంధనలు వర్తిస్తాయో ఇప్పుడు చూద్దాం.
భారత పౌరసత్వ చట్టాల ప్రకారం.. మన దేశానికి రాజ్యాంగం వచ్చిన రోజు అంటే 1950 జనవరి 26 నుండి 1987 జూలై 1 మధ్య కాలంలో భారతదేశంలో పుట్టిన వారందరూ పుట్టుకతోనే భారతీయులుగా గుర్తింపు పొందుతారు. ఈ కాలంలో పుట్టిన వారికి పౌరసత్వం రావడానికి తల్లిదండ్రుల పుట్టుకతో ఎలాంటి సంబంధం లేదు, వారు దేశంలో పుడితే చాలు.
ఇక 1987 జూలై 1 తర్వాత మన దేశంలో పుట్టిన వారికి పౌరసత్వం రావాలంటే రూల్స్ కాస్త మారాయి. ఈ కాలంలో పుట్టిన పిల్లలకు భారత సిటిజన్‌షిప్ లభించాలంటే.. వారు పుట్టే సమయానికి వారి తల్లి లేదా తండ్రి (పేరెంట్స్‌లో ఎవరో ఒకరు) ఖచ్చితంగా భారత పౌరులై ఉండాలనే నిబంధనను తెచ్చారు.

టెక్నాలజీ మరియు వలసల కాలం పెరిగాక, 2004 డిసెంబర్ 3 తర్వాత పుట్టిన పిల్లల విషయంలో చట్టం మరింత స్ట్రిక్ట్ అయింది. ఈ తేదీ తర్వాత పుట్టిన వారికి పౌరసత్వం రావాలంటే.. తల్లిదండ్రులు ఇద్దరూ భారత పౌరులై ఉండాలి. ఒకవేళ ఒకరు మాత్రమే ఇండియన్ అయ్యి, మరొకరు అక్రమ వలసదారు కాకపోతే కూడా పౌరసత్వం లభిస్తుంది.
భారత పౌరసత్వం అనేది దేశంలో పుట్టిన సంవత్సరం మరియు తల్లిదండ్రుల పౌరసత్వం ఆధారంగా మారుతూ ఉంటుంది. దేశ భద్రత, అక్రమ వలసలను అరికట్టేందుకు ప్రభుత్వం కాలక్రమేణా ఈ మార్పులను తీసుకువచ్చింది. మన దేశ చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండటం ప్రతి ఒక్కరి బాధ్యత.
The post భారత పౌరసత్వం పొందాలంటే ఏమి కావాలి?..పూర్తి గైడ్! appeared first on Manalokam – Latest Telugu News & Updates.