Reading Time: < 1 minute
Khamenei Funeral Invite Puts India In Diplomatic Balancing Act

Khamenei funeral: ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకావాలని ప్రధాని నరేంద్ర మోడీని ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ ఆహ్వానించారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్త వైమానిక దాడుల్లో ఆయన మరణించారు. జూలై 4 నుంచి 9 మధ్య ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇరాన్ ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచ దేశాధినేతలతో పాటు మోడీకి ఆహ్వానం అందింది. అయితే, ఇప్పుడు ఈ ఆహ్వానం భారత్‌ను దౌత్య సంకటంలో పడేసింది. ఇరాన్‌తో భారత్‌కు ఉన్న చారిత్రక సంబంధాలు, యూఎస్-ఇజ్రాయిల్‌తో ఉన్న వ్యూహాత్మక సంబంధాల మధ్య భారత విదేశాంగ విధానానికి కీలక పరీక్షగా మారింది.

అయితే, ఖమేనీ అంత్యక్రియలకు మోడీ స్వయంగా హాజరయ్యే అవకాశం లేదని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఆ సమయంలో ప్రధాని విదేశీ పర్యటనలో ఉండే అవకాశం ఉంది. భారత్‌ తరుఫున ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారనే అంశం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇరాన్‌తో భారత్‌కు చారిత్రాత్మక సంబంధాలతో పాటు చమురు, వాణిజ్యం వంటి దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా, భారత్ పెట్టుబడులు పెట్టిన చాబహార్ పోర్టు చాలా కీలకంగా ఉంది. మరోవైపు అమెరికాతో భారత్‌కు బలమైన వాణిజ్య సంబంధాలు, రక్షణ సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయిల్‌తో వ్యూహాత్మక రక్షణ, సాంకేతిక, ఆర్థిక రంగాల్లో సహకారం ఉంది.

ఒక వేళ ఖమేనీ అంత్యక్రియలకు భారత్ తన ప్రతినిధి బృందాన్ని పంపితే, ఇరాన్‌తో సంబంధాలకు భారత్ ప్రాధాన్యత ఇచ్చే విషయాన్ని ప్రతిబింబిస్తుంది. అదే సమయంలో దీనిని అమెరికా, ఇజ్రాయిల్ ఎలా చూస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 2024లో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినప్పుడు భారత్ ఒక రోజు సంతాప దినాన్ని ప్రకటించింది. అప్పటి ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్‌ను అంత్యక్రియలకు పంపింది. ఈసారి కూడా ఇదే తరహా విధానాన్ని అనుసరించే అవకాశం ఉంది.

షియా ముస్లింలకు ఇరాన్ పెద్ద దిక్కుగా ఉంది. ఇరాన్ తర్వాత భారత్, పాకిస్తాన్‌లో షియా జనాభా ఎక్కువగా ఉంది. ఖమేనీ షియా ముస్లింలలో పెద్ద నాయకుడిగా పరిగణింబడుతారు. ఈ నేపథ్యంలో ఖమేనీ అంత్యక్రియలకు భారత్ ఎలా స్పందిస్తుందనే దానికి ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతానికి భారత్ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఇరాన్-అమెరికా-ఇజ్రాయిల్ సంబంధాలను భారత్ ఎలా బ్యాలెన్స్ చేస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.