
- పాలమూరు ప్రాజెక్ట్‌ను అర్థం చేసుకోవడానికే రెండున్నరేండ్లు పడితే…
- గౌరవెల్లి అర్థం కావడానికి ఐదేండ్లు పడుతదా ?
- ముఖ్యమంత్రికి నా ఎత్తుతో పనేంటి ? : హరీశ్‌రావు
హుస్నాబాద్, వెలుగు : రాష్ట్ర ఖజానాలో పేదల కోసం పైసలు లేవంటున్న సీఎం రేవంత్‌రెడ్డి.. తన నివాసం, క్యాంప్ ఆఫీస్‌ల కోసం మాత్రం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. రేవంత్‌రెడ్డిది మిషన్ మోడ్ కాదు, ముమ్మాటికీ కమిషన్ మోడ్ అని ఎద్దేవా చేశారు. హుస్నాబాద్ లో బుధవారం జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు, సర్‌పై అవగాహన సదస్సులో హరీశ్‌రావు మాట్లాడారు.
గురుకుల విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వని ప్రభుత్వం కాంట్రాక్టర్ల బిల్లులను మాత్రం వెంటనే క్లియర్ చేస్తోందన్నారు. కాంట్రాక్టర్ల నుంచి 15 నుంచి 20 శాతం కమీషన్లు వస్తున్నందునే వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. గురుకుల విద్యార్థులకు ఇచ్చే కోడిగుడ్లలో కూడా కమీషన్లు కొడుతున్నారని ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టు అర్థం చేసుకోవడానికే రెండున్నరేండ్లు పడితే… గౌరవెల్లి అర్థం కావడానికి ఐదేళ్లు పడుతుందా ? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవెల్లి ప్రాజెక్ట్‌ను ట్రయల్ రన్ వరకు తీసుకొచ్చిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 30 నెలలు గడిచినా 30 గజాల కాల్వ కూడా తవ్వలేకపోయిందని ఎద్దేవా చేశారు. స్కూల్ పిల్లల కార్యక్రమంలో తన ఎత్తు గురించి మాట్లాడడం తగదన్నారు. ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పార్టీ శ్రేణులు నిశితంగా పరిశీలించాలని సూచించారు. బీఆర్ఎస్ ఓట్లు తొలగిపోకుండా బూత్‌స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, రాజ్య సభ మాజీ సభ్యుడు లక్ష్మీకాంతరావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణ రావు, మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, తుల ఉమ పాల్గొన్నారు.