Reading Time: < 1 minute
Ayyanna Infra Md P Sridhar Arrested In Madhapur Kakatia Hills Land Forgery And Cheating Case

Ayyanna Infra MD P Sridhar Arrested: హైదరాబాద్‌లోని మాదాపూర్ కాకతీయ హిల్స్‌లో చోటుచేసుకున్న భూ వివాదం కేసులో అయ్యన్న ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) పి. శ్రీధర్‌ను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత భూయజమానుల ఫిర్యాదు మేరకు ఆయనపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేసిన పోలీసులు.. విచారణ అనంతరం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి…

కాకతీయ హిల్స్ ప్రాంతంలో ఏడుగురు భూయజమానులకు చెందిన సుమారు 3,371 గజాల స్థలాన్ని పి. శ్రీధర్ డెవలప్‌మెంట్ కోసం తీసుకున్నారు. భూయజమానులు, డెవలపర్ మధ్య కుదిరిన ప్రాథమిక ఒప్పందం ప్రకారం.. ఆ స్థలంలో ఎనిమిది అంతస్తుల భవనం నిర్మించేందుకు పరస్పర అంగీకారం జరిగింది. అయితే అనంతరం మరో రెండు అదనపు అంతస్తుల నిర్మాణానికి అనుమతులు పొందేందుకు శ్రీధర్ ప్రయత్నించిచారు. ఈ క్రమంలో అమెరికాలో నివసిస్తున్న నలుగురు భూయజమానుల సంతకాలను నకిలీగా సృష్టించి, వారి అనుమతి లేకుండానే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) నుంచి అదనపు అంతస్తుల నిర్మాణానికి అనుమతులు పొందారు.

ఈ విషయం తెలుసుకున్న భూయజమానులు వెంటనే జీహెచ్‌ఎంసీ అధికారులతో పాటు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు ఆధారంగా విచారణ ప్రారంభించిన పోలీసులు.. అదనపు అనుమతులకు సంబంధించిన అసలు పత్రాలను సమర్పించాలని శ్రీధర్‌ను కోరారు. అయితే ఆయన సంబంధిత ఒరిజినల్ డాక్యుమెంట్లను అందించలేదు. దీంతో సంతకాల ఫోర్జరీ, మోసం (చీటింగ్) తదితర ఆరోపణలపై కేసులు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు.. పి. శ్రీధర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం కోర్టులో హాజరుపరి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన మాదాపూర్ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారగా.. ఒప్పందాల విషయంలో నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.