Reading Time: < 1 minute

తిరుమల కొండపై ఏప్రిల్ 25 నుంచి 27 వరకు పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు.. ఈ రెండు సేవలు రద్దు

Caption of Image.

తిరుమల కొండపై శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు 2026, ఏప్రిల్ 25 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. నారాయణగిరి ఉద్యాన వనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. 

ఏప్రిల్ 25వ తేదీ నుంచి మూడు రోజులు జరగనున్న ఈ వేడుకల్లో.. తొలిరోజు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనం, రెండో రోజు అశ్వ వాహనం, మూడో రోజు గరుడ వాహనంపై పద్మావతి అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. మరోపక్క ఉభయ నాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వేంచేస్తారు. ఆ తర్వాత కల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. 

మూడు రోజులు ఆర్జిత సేవ‌లు ర‌ద్దు :

శ్రీ ప‌ద్మావ‌తి పరిణయోత్సవాలు సంద‌ర్భంగా ఏప్రిల్ 25 నుంచి 27వ తేదీ వరకు తిరుమల కొండపై ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది టీటీడీ. 

పౌరాణిక ప్రాశస్త్యం :

పురాణాల ప్రకారం ఐదు వేల ఏళ్ల కిందట.. అంటే కలియుగం తొలి నాళ్లలో సాక్షాత్తు వైకుంఠం నుంచి శ్రీమహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు. ఆ సమయంలో నారాయణ వనాన్ని పరిపాలిస్తున్న ఆకాశ రాజు తన కుమార్తె అయిన శ్రీ పద్మావతిని.. శ్రీవేంకటేశ్వరునికిచ్చి వివాహం చేశారు. ఆకాశరాజు వైశాఖశుద్ధ దశమి శుక్రవారం పూర్వ ఫల్గుణి నక్షత్రంలో నారాయణ వనంలో కన్యా దానం చేసినట్లుగా శ్రీ వేంకటాచల మహాత్మ్యం గ్రంథం తెలుపుతోంది.

ఆనాటి పద్మావతీ శ్రీనివాసుల కల్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమి నాటికి ముందు ఒక రోజు.. తర్వాత ఒక రోజు కలిపి మొత్తం మూడు రోజులు పద్మావతీ పరిణయోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. 1992వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతోంది. ఆనాటి నారాయణ వనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యాన వనంలో శ్రీ పద్మావతీ పరిణయ వేడుకలు జరగడం విశేషం.

©️ VIL Media Pvt Ltd.