Reading Time: 2 minutes

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉందా..? ఏటా దాని విలువ ఎంత ఆవిరైపోతోందో తెలుసా..?

Caption of Image.

భారతదేశంలో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పునాదులను సామాన్య ద్రవ్యోల్బణం కంటే భయంకరంగా దెబ్బతీస్తున్న అంశం మెడికల్ ఇన్‌ఫ్లేషన్. ఏటా పెరుగుతున్న నిత్యావసరాల ధరలు మనకు కనిపిస్తాయి కానీ.. మనం కట్టిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ విలువ లోలోపలే ఆవిరైపోతుందన్న చేదు నిజం మాత్రం ఆసుపత్రి బిల్లు చేతికి వచ్చే వరకు చాలా మందికి తెలియటం లేదు. ఈ సైలెంట్ కిల్లర్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అసలు నిజాలు ఇవే..

చాపకింద నీరులా పెరిగిపోతున్న వైద్య ఖర్చులు..
గత కొన్నేళ్లుగా భారతదేశంలో సాధారణ ద్రవ్యోల్బణం 4 నుండి 6 శాతం మధ్య ఉంటే.. వైద్య ద్రవ్యోల్బణం మాత్రం 12 నుండి 14 శాతంగా నమోదవుతోంది. అంటే బయట వస్తువుల ధరలు పెరిగే వేగం కంటే ఆసుపత్రి ఖర్చులు రెట్టింపు వేగంతో దూసుకుపోతున్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీల లెక్కల ప్రకారం.. 2018లో రూ.24వేల 569గా ఉన్న సగటు ఏడాది ట్రీట్మెంట్ బిల్ క్లెయిమ్స్ ఖర్చు, 2022 నాటికి రూ.64వేల 135కు చేరింది. అంటే కేవలం నాలుగేళ్లలో 160 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఈ వేగంతో వెళ్తే 2026లో రూ.5 లక్షలు అయ్యే ఆపరేషన్ 5ఏళ్ల తర్వాత రూ.9 లక్షలకు చేరుతుంది.

రూ.5 లక్షల పాలసీ అసలు విలువెంత..
చాలామంది మధ్యతరగతి ప్రజలు తమ దగ్గర రూ. 5 లక్షల పాలసీ ఉందన్న ధీమాతో హ్యాపీగా ఉంటుంటారు. కానీ 12 శాతం వైద్య ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకుంటే.. 5 ఏళ్ల క్రితం తీసుకున్న రూ.5 లక్షల పాలసీ విలువ ఈరోజు హాస్పిటల్ ఖర్చుల ప్రకారం కేవలం రూ.2లక్షల 80వేలకు పడిపోయింది. పాలసీ పేపర్ మీద రూ.5 లక్షలు అని కనిపిస్తున్నా.. దాని కొనుగోలు శక్తి మాత్రం సగానికి పడిపోయింది. అనారోగ్యం వచ్చి పెద్ద ఆసుపత్రిలో చేరినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినా.. ఇంకా చేతినుంచి లక్షల రూపాయలు కట్టాల్సి వచ్చినప్పుడు గానీ ఈ విలువ తరుగుదల చాలా మందికి అర్థం కావట్లేదు.

Also Read : రష్యా, ఇరాన్ క్రూడ్ ఆయిల్ అమ్మకాలకు బ్రేక్

పెరుగుతున్న టెక్నాలజీ.. 
వైద్య రంగంలో వస్తున్న రోబోటిక్ సర్జరీలు, అధునాతన MRI స్కాన్లు, విదేశీ మందులు చికిత్స నాణ్యతను పెంచుతున్నా.. మరోపక్క అవి సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. దీనికి తోడు క్యాన్సర్, గుండెపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స ఖర్చులు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లోని పెద్ద ఆసుపత్రుల్లో ICU ఖర్చులు, స్పెషలిస్ట్ ఫీజులు మధ్యతరగతి వారి ఏళ్లనాటి కష్టార్జితం, సేవింగ్స్ ఒక్క వారంలోనే తుడిచిపెట్టేస్తున్నాయి. 

మరి పరిష్కారం ఏంటి?
కేవలం ఒక బేస్ పాలసీ మీద ఆధారపడటం ఇప్పుడు ఏమాత్రం సురక్షితం కాదని మధ్యతరగతి ప్రజలు గమనించాలి. కనీసం రూ.10 లక్షల బేస్ పాలసీతో పాటు, దానికి అదనంగా సూపర్ టాప్-అప్ పాలసీని యాడ్ చేయటం బెటర్. ఇది తక్కువ ప్రీమియంతో రూ.50 లక్షల వరకు కవరేజీని అందిస్తుంది. అలాగే మీ పాలసీని ప్రతి 2-3 ఏళ్లకు ఒకసారి సమీక్షించుకుని, ప్రస్తుత వైద్య ఖర్చులకు తగ్గట్టుగా కవరేజీని పెంచుకోవాలి. గుర్తుంచుకోండి.. మెడికల్ ఇన్‌ఫ్లేషన్ అనేది నిశ్శబ్దంగా మీ ఇన్సూరెన్స్‌ను దహించే మంట. అది ఆసుపత్రి బిల్లు రూపంలో మీ ముందుకు రాకముందే మేల్కొనడం మంచిది. 

©️ VIL Media Pvt Ltd.