Reading Time: < 1 minute
Allu Arjun Aaa Multiplex Inorbit Mall Visakhapatnam

AAA Cinemas : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో నిర్మించిన అత్యాధునిక మల్టీప్లెక్స్ ‘AAA (AAA Cinemas)’ విశాఖపట్నంలోని ఇనార్బిట్ మాల్ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైంది. నేడు ఉదయం జరిగిన ఈ విలాసవంతమైన ప్రారంభోత్సవంలో అల్లు అర్జున్ స్వయంగా పాల్గొని మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు. వైజాగ్ నగరం తన హృదయానికి ఎంతో దగ్గరైన ప్రదేశమని, తన సినీ ప్రస్థానంలో ఈ నగరానికి ఎల్లప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు.

తన తొలి చిత్రం ‘గంగోత్రి’ షూటింగ్ సమయంలో ఈ వీధుల్లో నడిచిన రోజులను గుర్తుచేసుకుంటూ బన్నీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆనాడు ఒక నటుడిగా ప్రయాణం మొదలుపెట్టి, ఈ రోజు అదే నగరంలో సొంత మల్టీప్లెక్స్‌ను ప్రారంభించడం తనకు ఒక అందమైన కల నిజమైనట్లుగా ఉందంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు. వైజాగ్ ప్రజలతో తనకు ఉన్న బంధం మాటల్లో చెప్పలేనిదని ఆయన పేర్కొన్నారు.

వైజాగ్ సినీ ప్రేక్షకులకు అంతర్జాతీయ స్థాయి సినిమా అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ ‘AAA’ మల్టీప్లెక్స్‌ను తీర్చిదిద్దినట్లు అల్లు అర్జున్ ప్రకటించారు. మూవీ లవర్స్ కోసం ప్రత్యేక స్క్రీన్స్, అత్యంత సౌకర్యవంతమైన సీటింగ్ , అత్యాధునిక సౌండ్ టెక్నాలజీతో దీనిని రూపొందించినట్లు చెప్పారు. వైజాగ్ ప్రజల నడుమ ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ వచ్చి ఈ సరికొత్త మూవీ ఎక్స్‌పీరియన్స్‌ను ఆస్వాదించాలని ఐకాన్ స్టార్ ఆకాంక్షించారు.