
‘కేజీఎఫ్ 2’ రిలీజ్ అయిన తర్వాత యష్ మూడేళ్ళు గ్యాప్ తీసుకున్నాడు. ఈ విరామంలో ఎంతో మంది స్టార్ డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. ఎవ్వరినీ కాదని లేడీ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ కు ఛాన్స్ ఇచ్చి యష్ షాక్ ఇస్తే, గ్లింప్స్ టీజర్ తో డైరెక్టర్ షాక్ ఇచ్చింది. విమర్శల నడుమ లేడీ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ పేరు హైలైట్ కావడంతో ఒక్కసారిగా క్రేజీ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఈ మధ్యకాలంలో ‘టాక్సిక్’ పై వచ్చినన్ని విమర్శలు మరో సినిమా పై రాలేదు. గ్లింప్స్ వచ్చినా, టీజర్ వచ్చినా, పాటలు వచ్చినా చర్చ జరగాల్సిందే! అడల్ట్ మూవీ తీసింది అంటూ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ ను టార్గెట్ చేశారు నెటిజన్లు. ఇంత వైలెన్స్, హాలీవుడ్ లెవెల్ లో రొమాన్స్ అంటూ మోహన్‌దాస్ పై విమర్శలు వస్తే… యష్, రామగోపాల్ వర్మ ఆమెను సమర్థించడమే కాదు, పొగడ్తలు కురిపించి అండగా నిలిచారు.
‘టాక్సిక్’ నుంచి ఇప్పటివరకు నాలుగు వీడియోలు వస్తే, దేనికదే అరాచకం సృష్టించాయి. అందుకు ఏమాత్రం తగ్గకుండా ట్రైలర్ తో ‘అడల్ట్ మూవీ’ పేరు నిలబెట్టుకున్నారు మేకర్స్. వైలెన్స్, రొమాన్స్ రెండు కళ్ళు అన్నట్టు గీతు ‘టాక్సిక్’ ను తీసిందా అనిపిస్తుంది. ట్రైలర్ దగ్గరికి వచ్చేసరికి రొమాంటిక్ సీన్స్ ను తగ్గించి రక్తపాతం సృష్టించారు. ట్రైలరే నాలుగు నిమిషాల 39 సెకండ్లు ఉండడంతో సినిమా మూడు గంటలు దాటే ఛాన్స్ ఉంది. ఇక పాటల దగ్గరికి వస్తే, రొమాన్స్, ఇంటిమేసీ సీన్స్ తప్ప మరోటి లేదు. యష్, కియారా అద్వానీ పై తీసిన ‘తబాహి’ సాంగ్ పుట్టించిన హీట్ చల్లారక ముందే, తారా సుతారియా సాంగ్ తో మరోసారి హద్దులు దాటించేశారు. థర్డ్ సాంగ్ ఎవరిపై ఉంటుందో గానీ, వరుసగా మరో రొమాంటిక్ సాంగ్ తో హ్యాట్రిక్ కొడతారేమో చూడాలి.
ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు యష్ డ్యూయల్ రోల్ పోషించిన సంగతి బయటకు రాకుండా మేకర్స్ జాగ్రత్త పడ్డారు. ఇప్పటివరకు లాంగ్ బియర్డ్ తో కనిపించిన యష్, సెకండ్ రోల్ కోసం క్లీన్ షేవ్ తో గుర్తుపట్టలేనంతగా మేకోవర్ అయ్యారు. కియారా, తారా సుతారియాను పాటల్లో గ్లామర్ భామలుగా చూపించినా, ట్రైలర్ లో గ్లో మిస్ అయింది. సర్కస్ కంపెనీలో పనిచేస్తున్న కియారా అందాన్ని హెవీ మేకప్ డామినేట్ చేసింది. లేడీ డైరెక్టర్ ‘టాక్సిక్’ ను గ్లామర్ తో నింపేసింది. ఐదుగురు హీరోయిన్లు— నయనతార, కియారా, తారా సుతారియా, హుమా ఖురేషీ, రుక్మిణి వసంత్ నటించారు. ‘టాక్సిక్’ ట్రైలర్ ఈవెంట్ బెంగళూరులో జరగ్గా, ఎయిర్పోర్ట్ తారలతో కళకళలాడిపోయింది. ఐదుగురు భామల తళుకుబెళుకుల మధ్య ట్రైలర్ ఈవెంట్ గ్లామరస్‌గా సాగింది.