
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ కు హైదరాబాద్ నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు షాకిచ్చారు. 2026 కాన్వొకేషన్ వేడుకకు ముఖ్యఅతిథిగా వచ్చే అంశంపై అభ్యంతరం చెప్పారు. ముఖ్యఅతిథిగా సీజేఐ వచ్చే అంశంపై పరిశీలించాలని యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ లకు లేఖ రాయడం సంచలనంగా మారింది.
2026 లా పూర్తయిన విద్యార్థుల స్నాతకోత్సవ వేడుకకు ముఖ్యఅతిథిగా జస్టిస్ సూర్యకాంత్ హాజరు కావాల్సి ఉంది. అయితే దాదాపు 450 మంది లా విద్యార్థులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యూనివర్సిటీకి లేఖ రాశారు.
2026, జులై 20 నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు ముట్టడి సందర్భంగా విద్యార్థులపై పోలీసు చర్యలపై జస్టిస్ సూర్యకాంత్ వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు లెటర్ లో పేర్కొన్నారు.
జులై 23న వాదన సందర్భంగా.. విద్యార్థులపై పోలీసులు, బలగాల లాఠీ ఛార్జీ, దమనకాండ గురించి నమోదైన పిటీషన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రస్థావించారు. విద్యార్థులపై దాడులకు సంబంధించిన వీడియో చూడటానికి ఆయన నిరాకరించారు. మాకు వీడియో చూసే ఆసక్తి లేదు. అంత సమయం కూడా లేదు.. అంటూ పోలీసుల చర్యకు సంబంధించిన ఎవిడెన్సును చూసేందుకు నిరాకరించారు. దీనిపై అప్పట్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
►ALSO READ | వర్షంలో ఆటో ఎక్కాలనుకుంటే హడలే ! 7 కి.మీ.. రూ.800 అడిగిన డ్రైవర్.. షాకైన మహిళ..
ఆ ఘటనలో దాదాపు 70 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా మహిళలు, పిల్లలు కూడా గాయపడటం దేశం మొత్తాన్ని కదిలించేసింది. కానీ సీజేఐ మాత్రం.. కోర్టుకు అంత సమయం లేదని చులకన భావంతో మాట్లాడినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే అంశాన్ని నల్సార్ లా విద్యార్ధులు మెన్షన్ చేశారు.
అదే విధంగా విద్యార్థులను బొద్దింకలు అంటూ చేసిన అంశాన్ని కూడా ప్రస్థావించారు. 2025-26 బ్యాచ్ కు చెందిన లా విద్యార్థులుగా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. చీఫ్ గెస్టుగా జస్టిస్ సూర్యకాంత్ వచ్చే విషయంపై మాకు అభ్యంతరం ఉంది.. అంటూ లేఖలో పేర్కొన్నారు.
ప్రస్తుతం కాన్వొకేషన్ తేదీ, ముఖ్య అతిథిని ఇంకా ఫైనలైజ్ చేయలేదు కాబట్టి.. ఈ అంశాన్ని మరోసారి ఆలోచించాల్సిదిగా యూనివర్సిటీ వీసీకి లేఖ రాసినట్లు విద్యార్థులు పేర్కొన్నారు.
న్యాయశాస్త్ర విద్యార్థులుగా, మా ఆందోళన పరిమితమైనది.. పట్టభద్రులవుతున్న మా బ్యాచ్‌కు మాత్రమే ప్రత్యేకమైనది.. అని ఆ లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగ హక్కులు, న్యాయం పొందే అవకాశం, సమస్యల పట్ల హేతుబద్ధమైన సంప్రదింపులకు నల్సార్ (NALSAR) యూనివర్సిటీ కమిట్ మెంట్ ప్రతిబింబించే విధంగా స్నాతకోత్సవం ఉండాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.