Reading Time: < 1 minute
Cm Chandrababu Naidu Announces Financial Aid Medico Priyanka Death

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రికి చెందిన వైద్య విద్యార్థిని (మెడికో) ప్రియాంక మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నెల 3వ తేదీన కొంతమంది యువకులు కారుతో ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడిన ప్రియాంక, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న యువ డాక్టర్ నిండు నూరేళ్ల జీవితం ఇలా ముగిసిపోవడం తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు.

ఈ దారుణ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ప్రత్యేకంగా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కేసు దర్యాప్తు పురోగతిని, తదుపరి చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన నిందితులు ఇప్పటికే అరెస్టై జైలులో ఉన్నారని ఎస్పీ సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి, నిర్లక్ష్యంగా ప్రవర్తించి ప్రాణాలు తీసిన నిందితులపై కఠినమైన చట్టపరమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని, వారికి కఠిన శిక్ష పడేలా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ప్రమాదం జరిగిన వెంటనే ప్రియాంకకు రాజమండ్రిలో అందించిన ప్రాథమిక చికిత్స, ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి అందించారు. ఈ సందర్భంగా ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ. 20 లక్షల ఆర్థిక సాయం తక్షణమే అందించాలని అధికారులను ఆదేశించారు. క్లిష్ట సమయంలో ఉన్న బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, అవసరమైన ప్రతి సాయాన్ని అందిస్తుందని సీఎం భరోసా ఇచ్చారు.