Reading Time: < 1 minute
Mamitha Baiju Social Media Goodbye Premalu Beauty Latest News

Mamitha Baiju: ‘ప్రేమలు’ సినిమాతో తెలుగు సహా దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ బ్యూటీ మమితా బైజు కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే పబ్లిసిటీ కంటే మానసిక ప్రశాంతతకే తాను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని ఆమె తెలిపారు. ఇకపై వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో సినిమా అప్‌డేట్స్‌ను షేర్ చేయబోనని స్పష్టం చేశారు. తన సినిమాలకు సంబంధించిన వివరాలను పీఆర్ టీమ్ ద్వారా వెల్లడిస్తానని చెప్పారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మమితా తన వ్యక్తిగత విషయాలతో పాటు సినీ కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు వీరాభిమానినని, ఆయన సినిమాలను పదిసార్లకు పైగా చూసిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ‘ఇద్దరమ్మాయిలు’ సినిమాలో అల్లు అర్జున్ వాడిన క్యాసియో వాచ్, ఫుల్ స్లీవ్ టీషర్ట్ స్టైల్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, తాను కూడా ఆ స్టైల్‌ను కాపీ చేసేదాన్నని సరదాగా గుర్తుచేసుకున్నారు. కేరళలోని కొట్టాయంలో జన్మించిన మమితా బైజు తండ్రి డాక్టర్. ఆమె సైకాలజీలో డిగ్రీ పూర్తి చేశారు. తన అన్నయ్య మిథున్ రాష్ట్రస్థాయి క్రికెటర్ అని, తన జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలను ఆయనే తీసుకుంటారని చెప్పారు. అంతేకాదు.. తన పెళ్లి విషయంలోనూ అన్నయ్యదే తుది నిర్ణయమని, తనకు వచ్చే లవ్ ప్రపోజల్స్‌ను కూడా ఆయనే డీల్ చేస్తారని చెప్పి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం మమితా బైజు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సూర్య సరసన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో పాటు మూడు భాషల్లో తెరకెక్కుతున్న పలు ప్రాజెక్టుల్లో ఆమె నటిస్తున్నారు. ‘ప్రేమలు’ తర్వాత వచ్చిన క్రేజ్‌ను కొనసాగిస్తూ దక్షిణాదిలో వరుస అవకాశాలు అందుకుంటున్నారు.