Reading Time: 2 minutes
Tftdda By Election Results Telugu Dancers Association Controversy

హైదరాబాద్ వేదికగా తెలుగు ఫిలిం & టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) ఉప ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. అయితే, టాలీవుడ్ పెద్దలు వద్దని వారించినా నిర్వహించిన ఈ ఎన్నికలు పరిశ్రమలో తీవ్ర వివాదానికి దారితీశాయి. ఉప ఎన్నికల ఫలితాలను కార్మిక శాఖ విశ్రాంత డిప్యూటీ కమిషనర్, లీగల్ అడ్వైజర్ వి. సామ్రాట్ అశోక్ కుమార్ అధికారికంగా వెల్లడించారు. ప్రధాన కార్యదర్శి (జనరల్ సెక్రటరీ): G. బాలకృష్ణ (బాలు. G – కార్డ్ నెం. 426) 68 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఆయన ప్రత్యర్థి B. శ్రీనివాస్ గౌడ్ (లడ్డు శ్రీను – కార్డ్ నెం. 77)కు 23 ఓట్లు మాత్రమే లభించాయి.

కోశాధికారి (ట్రెజరర్): P. ఇశ్రాయేలు (తడివేలు – కార్డ్ నెం. 212) 79 ఓట్లు సాధించి, 34 ఓట్లు పొందిన G. వీరస్వామిపై 45 ఓట్ల వ్యత్యాసంతో గెలుపొందారు.

మహిళా కమిటీ సభ్యులు: K. నిరంజని (కార్డ్ నెం. 234 – 79 ఓట్లు), CH. సాయి లక్ష్మి (కార్డ్ నెం. 325 – 65 ఓట్లు) విజేతలుగా నిలిచారు. పోటీలో ఉన్న T. శ్రావణ సంధ్యకు 59 ఓట్లు వచ్చాయి.

ఏకగ్రీవంగా ఎన్నికైన వారు
ఉపాధ్యక్షుడు: G. శంకర్ (కార్డ్ నెం. 53)
జాయింట్ సెక్రటరీ: P. నాగ మల్లేశ్వర్ రావు (కార్డ్ నెం. 481)
ఆర్గనైజింగ్ సెక్రటరీ: G. రవితేజ (బన్ని – కార్డ్ నెం. 481)
ఈసీ కమిటీ సభ్యులు: P. కన్నయ్య (కార్డ్ నెం. 177), M. రమేష్ (చరణ్ – కార్డ్ నెం. 500), M. రాములు (కార్డ్ నెం. 531), B. వెంకన్న (కార్డ్ నెం. 415).

ఈ ఉప ఎన్నికల నిర్వహణ చుట్టూ తీవ్ర వివాదం నెలకొంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ ప్రతినిధులు ప్రస్తుత పరిస్థితుల్లో ఉప ఎన్నికలు నిర్వహించవద్దని సూచించినప్పటికీ, అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత ఏకపక్షంగా ముందుకు వెళ్లారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  అసోసియేషన్‌లో 600 మందికి పైగా సభ్యులుండగా, 502 మంది ఓటర్లుగా ఉన్నారు. అయితే ఈ ఎన్నికలలో కేవలం 114 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు (వీటిలో 2 ఓట్లు చెల్లనివిగా నమోదయ్యాయి). శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, భాను మాస్టర్ సహా మూడొంతుల మంది సభ్యులు ఈ ఉప ఎన్నికలకు దూరంగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి, ఫెడరేషన్ మార్గదర్శకాలను తుంగలో తొక్కి ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించడంపై అసోసియేషన్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రెసిడెంట్ సుమలత తీరుపై త్వరలోనే ఫెడరేషన్ కౌన్సిల్‌కు అధికారికంగా ఫిర్యాదు చేయడానికి వ్యతిరేక వర్గం డాన్సర్లు సన్నాహాలు చేస్తున్నారు.