Reading Time: 2 minutes
Yellow Plastic Chairs Cleaning Tips Home Hacks

Plastic Chairs Cleaning Tips: బాల్కనీ, టెర్రస్, తోట లేదా ఇంటి ప్రాంగణంలో ప్లాస్టిక్ కుర్చీలు ఉపయోగించడం చాలా సాధారణం. అయితే ఎండ, వర్షం, దుమ్ము, తేమ, రోజువారీ వినియోగం కారణంగా కొంతకాలానికి తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలు పసుపు, నలుపు రంగులోకి మారుతుంటాయి. ఎంత నీటితో కడిగినా మొండి మరకలు తొలగకపోవడంతో చాలామంది వాటి పని అయిపోయిందని పక్కన పడేసి కొత్త కుర్చీలు కొనుగోలు చేస్తుంటారు. అయితే కొన్ని సింపుల్ హోమ్ క్లీనింగ్ చిట్కాలతో పాత ప్లాస్టిక్ కుర్చీలను మళ్లీ శుభ్రంగా, మెరిసేలా, కొత్త వాటిలా మార్చుకోవచ్చని మీకు తెలుసా. దీని కోసం ఖరీదైన క్లీనింగ్ ఉత్పత్తులు వాడవసరం లేదు. ఇంట్లో సాధారణంగా లభించే కొన్ని వస్తువులతోనే కుర్చీలపై పేరుకున్న మురికి, మరకలను తొలగించేందుకు ప్రయత్నించవచ్చు. అవి ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

1. ప్లాస్టిక్ కుర్చీలపై గట్టిగా పేరుకున్న మరకలను తొలగించేందుకు బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. దీనిని ఎలా వాడాలంటే.. ముందుగా కొద్దిగా బేకింగ్ సోడాలో నీటిని కలిపి చిక్కటి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను మరకలు ఉన్న ప్రాంతాల్లో రాసి 10 నుంచి 15 నిమిషాలు అలాగే ఉంచాలి. అనంతరం స్పాంజ్ లేదా మెత్తని బ్రష్‌తో సున్నితంగా రుద్ది శుభ్రమైన నీటితో కడగాలి. చివరగా పొడి గుడ్డతో తుడిచి ఆరబెట్టాలి.

2. నిమ్మకాయ రసం, ఉప్పు మరకలను తొలగించడంలో సహాయపడతాయి. ముందుగా సగం నిమ్మకాయను తీసుకోవాలి. తర్వాత కుర్చీలపై పెరుకున్న మరకలపై కొద్దిగా ఉప్పు చల్లాలి. ఇప్పుడు మరకలు ఉన్న ప్రాంతంపై నిమ్మకాయను సున్నితంగా రుద్దాలి. 10 నుంచి 15 నిమిషాల తర్వాత నీటితో బాగా కడిగి పూర్తిగా ఆరబెట్టాలి.

3. డిటర్జెంట్, గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. కుర్చీలపై సాధారణ దుమ్ము, మట్టి, రోజువారీ మురికి మాత్రమే ఉంటే డిటర్జెంట్, గోరువెచ్చని నీటితో సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. ముందుగా గోరువెచ్చని నీటిలో కొద్దిగా డిటర్జెంట్ కలపాలి. అందులో మెత్తని గుడ్డ లేదా స్పాంజ్‌ను ముంచి కుర్చీ మొత్తం తుడవాలి. మరకలు ఉన్న చోట కొద్దిగా ఎక్కువ శ్రద్ధ పెట్టి శుభ్రం చేయాలి. ఆ తర్వాత స్వచ్ఛమైన నీటితో కడిగి, పొడి గుడ్డతో తుడిచి పూర్తిగా ఆరబెట్టాలి.

శుభ్రం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
* ప్లాస్టిక్ కుర్చీలను శుభ్రం చేసేటప్పుడు గట్టి వైర్ బ్రష్‌లను ఉపయోగించకపోవడం మంచిది. వాటివల్ల ప్లాస్టిక్‌పై గీతలు పడే అవకాశం ఉంటుంది. అలాగే బలమైన రసాయనాలు, బ్లీచ్ వంటి పదార్థాలను పదేపదే ఉపయోగించకపోవడం మంచిది. శుభ్రం చేసిన తర్వాత కుర్చీలను పూర్తిగా ఆరబెట్టాలి.

* అదేవిధంగా కుర్చీలను తరచూ తేలికపాటి పద్ధతిలో శుభ్రం చేస్తూ ఉంటే దుమ్ము, మురికి ఎక్కువగా పేరుకుపోకుండా చూసుకోవచ్చు. అయితే ప్లాస్టిక్ రంగు మారడం కేవలం మురికి వల్ల కాకుండా సూర్యరశ్మి, వాతావరణ ప్రభావంతో ప్లాస్టిక్ వృద్ధాప్యం కారణంగానూ జరిగి ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో ఇంటి చిట్కాలతో పూర్తిగా పాత రంగును తిరిగి తీసుకురావడం సాధ్యం కాకపోవచ్చు.