Reading Time: 2 minutes
Why Nayanthara Came For Yashs Toxic Trailer Event

Toxic Trailer: యష్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘టాక్సిక్’ ట్రైలర్ ఎట్టకేలకు శనివారం బెంగళూరులో విడుదలైంది. ఇప్పటి వరకు ‘టాక్సిక్’కు బోల్డ్ కంటెంట్ ఎక్కువ ఉందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింబ్స్ కూడా ఇవే సంకేతాలు ఇచ్చాయి. అయితే తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ ఇమేజ్‌ను మార్చేలా ఉందని అభిమానులు భావిస్తున్నారు. ట్రైలర్‌లోని యాక్షన్ సీక్వెన్స్, మాఫియా ప్రపంచాన్ని చూపించిన విధానం బోల్డ్ కంటెంట్ మీద చర్చకు తెరతీసినట్లే కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. నిన్న జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి నయనతార హాజరు కావడం మాత్రం ప్రత్యేక ఆకర్షణగా మారింది. సాధారణంగా సినిమా ప్రమోషన్స్ కి దూరంగా ఉండే నయనతార, ఈసారి తన రూల్స్ బ్రేక్ చేసి బెంగళూరులో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. అసలు ఆమె ఎందుకు వచ్చింది? యష్‌కు ఆమెకు ఉన్న అనుబంధం ఏంటి? అనే విషయాలకు కూడా క్లారిటీ ఇచ్చింది నయన్.

ప్రమోషన్స్ కి నయనతార దూరంగా ఉంటారనే విషయం తెలిసిందే. అయితే ‘టాక్సిక్’ విషయంలో మాత్రం ఆమె తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ ఇదే విషయాన్ని నయనతారను ప్రశ్నించగా, ఆమె ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ప్రచార కార్యక్రమాలు తనకు ఇష్టం లేక కాదని, వాటికి తాను అంతగా అలవాటు పడలేకపోవడం వల్లే సాధారణంగా దూరంగా ఉంటానని ఆమె వివరించారు. అయితే ‘టాక్సిక్’ తనకు చాలా ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అని నయనతార తెలిపారు. యష్ తనకు ఫోన్ చేయడం ఈ కార్యక్రమానికి రావడానికి ప్రధాన కారణమని చెప్పారు. యష్ ఒక్క ఫోన్ కాల్ చేయగానే తాను బెంగళూరుకు వచ్చేందుకు వెంటనే అంగీకరించానని వెల్లడించారు. యష్‌పై ఆమెకున్న గౌరవం, సినిమా పట్ల ఉన్న నమ్మకం ఈ నిర్ణయం వెనుక ఉన్నట్లు ఆమె మాటల ద్వారా స్పష్టమైంది. ఇదే సమయంలో దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ విజన్‌ను కూడా నయనతార ప్రశంసించారు. సృజనాత్మక ఆలోచనతో తెరకెక్కుతున్న ప్రాజెక్టులకు తాను ఎప్పుడూ మద్దతు ఇస్తానని ఆమె చెప్పారు. ‘టాక్సిక్’ విషయంలో దర్శకురాలి ఆలోచన తీరు తనను ఆకట్టుకుందని పేర్కొన్నారు.

ఇక ‘టాక్సిక్’లో యష్ ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన నటించడంతో పాటు ఈ ప్రాజెక్ట్‌లో సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ లో కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచిందా లేదా అనే దానిపై మాత్రం సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది యష్ కొత్త లుక్, యాక్షన్ ఎలిమెంట్స్‌ను ప్రశంసిస్తుండగా, మరికొందరు ట్రైలర్‌పై మిక్స్డ్ టాక్ వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ యష్ ఒక్క ఫోన్ కాల్‌తో నయనతార బెంగళూరు రావడానికి అంగీకరించిందన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 26, 2026న పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరి భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానున్న ‘టాక్సిక్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.