
- అకడమిక్ అండ్ ఇండస్ట్రీ అనుసంధానంపై నిపుణుల ప్యానెల్ చర్చ
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: దేశ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణుల ప్యానెల్ అభిప్రాయపడింది. పాలమూరు యూనివర్సిటీ ఆధ్వర్యంలో కన్హా శాంతివనంలో నిర్వహిస్తున్న విజన్ ఇండియా–2047 జాతీయ సదస్సు రెండో రోజు పీయూ లైబ్రరీ ఆడిటోరియంలో ‘అకడమిక్ అండ్ ఇండస్ట్రీ అనుసంధానం’పై చర్చ జరిగింది.
నిపుణుల ప్యానెల్ సభ్యులు ఎన్ఐఎన్ సైంటిస్ట్ డా.రాజేందర్, ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్ డీన్ డా.జోషి, కోడ్ తంత్ర కో ఫౌండర్ సీఈవో టీఎస్వీ రమణ పాల్గొని చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యూనివర్సిటీల్లో అందించే విద్య పరిశ్రమల్లో వస్తున్న మార్పులు, సాంకేతిక అభివృద్ధి, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.
పరిశోధనా సంస్థలు, యూనివర్సిటీల మధ్య బలమైన భాగస్వామ్యం ఉండాలని పేర్కొన్నారు. విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు పరిశోధన ఫలితాలను సమాజానికి ఉపయోగపడేలా వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య విద్య, పరిశోధన, ఆరోగ్యరంగంలో పరిశ్రమల సహకారం ప్రాధాన్యతను వివరించారు. ఆధునిక సాంకేతికతను వైద్య విద్యతో అనుసంధానం చేయడం ద్వారా వైద్య నిపుణులను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దవచ్చన్నారు. విద్యార్థులు కేవలం డిగ్రీ పొందడమే లక్ష్యం కాకుండా, సమస్యలను గుర్తించి వాటికి సాంకేతిక పరిష్కారాలు చూపించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
మారుతున్న అవసరాలు, సాంకేతిక నైపుణ్యాల ప్రాధాన్యత, విద్యార్థుల్లో ఉద్యోగానికి అవసరమైన స్కిల్స్ పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యత, విద్యాసంస్థల్లో స్టూడెంట్లు పొందుతున్న నైపుణ్యాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ఇంటర్న్షిప్లు, ఇండస్ట్రీ విజిట్లు, లైవ్ ప్రాజెక్టులు, ఇండస్ట్రీ మెంటరింగ్, ప్రాక్టికల్ ట్రైనింగ్ వంటి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలన్నారు.
2047 నాటికి ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంలో యువత కీలక పాత్ర పోషించాలని నిపుణులు పేర్కొన్నారు. దేశంలోని యువ మానవ వనరులను, సరైన విద్య, నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన అవకాశాలతో అనుసంధానం చేస్తే భారతదేశం ప్రపంచ స్థాయిలో మరింత బలమైన స్థానాన్ని సాధించగలదని తెలిపారు. యువతను ఉద్యోగాల కోసం ఎదురు చూసే స్థితి నుంచి ఉద్యోగాలను సృష్టించే స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ రమేశ్ బాబు పాల్గొన్నారు.