Reading Time: < 1 minute

కరీంనగర్: టెండర్ ధాన్యం బకాయిల్లో రూ.77 కోట్లు వసూలు…మరో రూ.48 కోట్లు పెండింగ్

Caption of Image.
  •     ముగిసిన గడువు 

కరీంనగర్, వెలుగు: విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్ మెంట్ దాడులు, సర్కార్ హెచ్చరికల నేపథ్యంలో 2022-–23 నాటి టెండర్ ధాన్యం బకాయిలు చాలా మేరకు వసూలయ్యాయి. కరీంనగర్ జిల్లాలో రూ.125 కోట్ల మేర బకాయిలు ఉండగా.. రూ.77.01 కోట్లు వసూలయ్యాయి. 2022–23 యాసంగి సీజన్ లో కస్టం మిల్లింగ్ కోసం జిల్లాలోని మిల్లులకు ధాన్యం అప్పగించారు. 

ఆ తర్వాత సీజన్లు మారినా మెజార్టీ మిల్లర్లు సీఎంఆర్ ధాన్యం మాత్రం అప్పగించలేదు. ఈ నేపథ్యంలోనే మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని 2024 జనవరిలో ఈ-టెండర్ ద్వారా అమ్మారు. ఇలా 2,18,511 టన్నుల వడ్లను టన్నుకు రూ.18,000 చొప్పున మిల్లర్లే దక్కించుకున్నారు. ఇందులో గడువులోపు సగానికి పైగా డబ్బులు చెల్లించారు. కానీ 80 వేల టన్నులకు సంబంధించిన ధాన్యం బకాయిలు రెండేళ్లుగా పేరుకుపోయాయి. కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వం ఇచ్చిన గడువు(శుక్రవారం వరకు)లోపు రూ.77 కోట్లు వసూలయ్యాయి. 

ఇందులో అత్యధికంగా ఒకే యాజమాన్యానికి సంబంధించిన రూ.35 కోట్లు ఉండడం విశేషం. మానకొండూరులోని వీరభద్ర ఇండస్ట్రీస్, సిద్ది వినాయక ఇండస్ట్రీస్, తిమ్మాపూర్ మండలం రేణికుంటలోని ఆర్కే ఇండస్ట్రీస్, సాయిశ్రీనివాస్ ఇండస్ట్రీస్ పూర్తిగా చెల్లించాయి. తిమ్మాపూర్ లోని వెంకటేశ్వర ఇండస్ట్రీస్, మానకొండూరులోని మానస, హనుమాన్ ఇండస్ట్రీస్ నుంచి బకాయిలు వసూలయ్యాయి. జమ్మికుంట, హుజురాబాద్ కు చెందిన చాలా మిల్లుల నుంచి బకాయిలు వసూలు కావాల్సి ఉంది. వీటిని డీఫాల్ట్​గా గుర్తించి కేసులు నమోదు చేసి ఆర్ఆర్​యాక్ట్ కింద రికవరీకి ఆఫీసర్లు రెడీ అవుతున్నారు. నిర్ణీత గడువులోగా బకాయిలు చెల్లించని మిల్లర్ల నుంచి 25శాతం అదనంగా వసూలు చేయనున్నారు. 

©️ VIL Media Pvt Ltd.