Reading Time: < 1 minute
Telangana: మొట్టమొదటి కంటైనర్ బేస్డ్ అంగన్వాడి కేంద్రం.. అక్కడ తొలిసారిగా ఏర్పాటు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల పరిధిలోని మారుమూల ఏజెన్సీ అటవీ ప్రాంత గొత్తికోయ గ్రామం ధర్మన్న నగర్‌లో జిల్లాలోనే మొట్టమొదటి కంటైనర్ బేస్డ్ అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు అయ్యింది. దాతల సహాయంతో 4 లక్షల రూపాయల విలువైన కంటైనర్‌ బేస్డ్‌ అంగన్‌వాడీ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (TGSCPCR) సభ్యురాలు కంచర్ల వందనా గౌడ్,
అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా ప్రారంభించారు. గిరిజన చట్టాలు అమలవుతున్న అటవీ ప్రాంత గ్రామాల్లో భవన నిర్మాణాలకు అనుమతులు లేని కారణంగా కంటైనర్ బేస్డ్ అంగన్వాడి కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషదాయకమన్నారు. పూరి గుడిసెల్లో సరైన మౌలిక వసతులు, సరైన మెటీరియల్ లేని పరిస్థితుల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అంగన్‌వాడీ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ కంటైనర్‌ ఆధారిత కేంద్రాన్ని జిల్లాలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు.

ఈ కేంద్రం ద్వారా స్థానికంగా ఉన్న చిన్నారులకు ప్రీ-స్కూల్‌ విద్య, పౌష్టికాహారం, ఆరోగ్య సంబంధిత సేవలు అందుబాటులోకి రానున్నాయి. కంటైనర్‌ బేస్డ్ అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేయడం పట్ల గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. జిల్లాలో మారుమూల ఆదివాసి, గుత్తి కోయ గ్రామాలు అనేకం ఉన్నాయి. కనీస మౌలిక సదుపాయాలు, వసతులు కూడా లేని పరిస్థితుల్లో గుత్తి కోయలు ఉన్నారు. బాహ్య ప్రపంచానికి దూరంగా అభివృద్ధికి ఆమడ దూరంలో జీవనం సాగిస్తున్న వీరికీ దాతలు సాయంతో ఇలాంటి సదుపాయాలు కల్పించడం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది.