
రాజర్థాతురుడైనచో నెచట ధర్మంబుండు నేరీతి నా
నా జాతిక్రియ లేర్పడున్ సుఖము మాన్యశ్రేణికెట్లుబ్బు రూ
పాజీవాళికి నేది దిక్కు ధృతి నీ భక్తుల్ భవత్పాద నీ
రేజంబుల్ భజియింతు రే తెఱగునన్ శ్రీకాళహస్తీశ్వరా!
ప్రజలను పరిపాలించే రాజుకి ధనం మీద అత్యాశ కలిగి ఉంటే, అతనిలో సత్ప్రవర్తనం ఎలా ఉంటుంది. రకరకాల వర్ణాల వారి పనులు ఏవిధంగా జరుగుతాయి. గౌరవనీయ స్థానంలో ఉన్నవారి మనస్సులకు ప్రశాంతత ఎలా ఉంటుంది? నీ భక్తులు ధృతిమంతులై నీ చరణ కమలాలను ఎలా సేవిస్తారు..? అని ధూర్జటి మహాకవి ‘శ్రీకాళహస్తీశ్వర శతకము’ లో చెప్తున్నాడు.
మంచి నడవడిక, ధర్మానికి బద్ధుడైన రాజులు చాలా అరుదుగా కనిపిస్తారు. డబ్బు మీద అత్యాశ కలిగిన రాజులే ఎక్కువమంది ఉంటారు. ‘ప్రభుర్ధనపరాయణః’ పరిపాలకుడైన రాజుకి డబ్బు మీదే వ్యామోహం ఉంటుంది అనేమాట అందుకే వ్యాప్తిలోకి వచ్చింది.
డబ్బు మీద వ్యామోహం ఉన్న ప్రభువుల పరిపాలనలో ధర్మం మొదలైన మంచి గుణాలకు అవకాశం ఉండదు. ‘యథా రాజా తథా ప్రజా’ అన్న చందాన ప్రజలంతా ప్రభువునే అనుసరించి, మోసాలు చేస్తూ డబ్బు సంపాదిస్తుంటారు.
‘అర్థాతురాణాం నగురుర్నబన్ధుః’ డబ్బు మీద వ్యామోహం ఉన్నవాళ్లకి గురువు, బంధువు అనే తేడాలు ఉండవు. ఎంత అధర్మం చేసైనా సరే డబ్బు సంపాదించడమే లక్ష్యంగా జీవిస్తారు. ధర్మానికి విఘాతం కలుగకూడదంటే రాజు అత్యాశాపరుడై ఉండకూడదు. అప్పుడే ఆ రాజ్యంలోని అన్ని వర్ణాల వాళ్లు తమ విధులను చక్కగా నిర్వహించగలుగుతారని ఈ పద్యం చెప్తోంది.
దిలీప మహారాజు గురించి కాళిదాసు ‘రఘువంశం’ కావ్యంలో ‘త్యాగాయ సంభృతార్థానాం.. సత్పాత్రదానం కోసమే ధనం పోగుచేసేవారు..’ అంటే.. తన ప్రజలలో అర్హులైన వారికి దానం చేయడం కోసమే ధనాన్ని సముపార్జించేవాడని చెప్తాడు. పరిపాలించే రాజుకి ఉండవలసిన లక్షణం అది. దిలీప మహారాజు తరవాత వచ్చిన ఆ వంశపు రాజులందరూ సత్పాత్రదానం కోసం మాత్రమే ధనం ఆర్జించారు.
రాముడి పరిపాలనలో ప్రజలంతా సుఖశాంతులతో ఉన్నారు కనుకనే నేటికీ ‘రామరాజ్యం’ అనే పేరు నిలబడిపోయింది. భారతదేశంలో ఉన్న సంపదలు చూసి దురాశపడిన విదేశీయులు ఈ దేశం మీద దండెత్తి వచ్చి, అత్యాశతో ధనాన్ని దోచుకుపోయారు. ఆ ధనం కోసం ఎంతోమంది ప్రజలను హింసించారు.
ప్రపంచ విజేత అని పేరుపొందిన గ్రీకు వీరుడు అలెగ్జాండర్ తన చివరి కోరికగా తన రెండుచేతులనూ పైకి పెట్టి సమాధి చేయమన్నాడు. ‘మనం ఎంత సంపాదించినా మన వెంట ఏదీ రాదు మనం ఖాళీ చేతులతో వెళ్తాము ’ అనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు గాను తన చేతులను ఆ విధంగా ఉంచమన్నాడని చరిత్ర చెప్తోంది.
రావణాసురుడు.. తన దగ్గర ఉన్న సంపదతో సంతృప్తి చెందలేదు. ఇంకా ఇంకా కావాలనుకున్నాడు. కుబేరుడి మీద యుద్ధం చేసి, సంపదలతో పాటు పుష్పక విమానాన్ని కూడా అపహరించాడు. రావణాసురుడు అత్యాశతో ఇంత సంపాదించాడు. ఆ అత్యాశతోనే చేసిన పనుల వలన వంశనాశనానికి కారకుడయ్యాడు.
ధనాశకు దుర్యోధనుడు ఉత్తమ ఉదాహరణ. పాండురాజు సంపాదించిన సంపదలను కౌరవులకు, పాండవులకు సమానంగా పంచారు. రాజసూయ యాగం చేసే సమయంలో పండితులకు, విప్రులకు, అవసరంలో ఉన్నవారికి దానం చేయడం కోసం అందరు రాజులను జయించి, ధనం సంపాదించారు. రాజసూయ యాగం పూర్తి కాగానే అర్హులైనవారందరికీ ఆ సంపదలను దానం చేశారు. అది చూసి దుర్యోధనుడు ఈర్ష్య చెందాడు.
ఎలాగైనా సరే పాండవుల సంపదలు అపహరించాలనుకున్నాడు. శకుని సహాయంతో పాండవులతో మాయా జూదం ఆడాడు. అందులో పాండవులు సకల సంపదలు పోగొట్టుకున్నారు. ఒప్పందం ప్రకారం పదమూడు సంవత్సరాల పాటు అరణ్యఅజ్ఞాత వాసాలు పూర్తి చేసి తిరిగి వచ్చారు. అనుకున్న ప్రకారం తమ రాజ్యాన్ని తమకు ఇవ్వమని కోరారు. ధనంపై వ్యామోహం ఉన్న దుర్యోధనుడు అందుకు నిరాకరించాడు.
కనీసం ఐదుగురికి ఐదు ఊళ్లు ఇమ్మన్నారు పాండవులు. ‘వాడి సూది మొన మోపినంత భూమిని కూడా ఇవ్వను’ అన్నాడు అత్యంత ధనాశాపరుడైన దుర్యోధనుడు. చివరకు చేసేది లేక పాండవులు కౌరవులతో యుద్ధం చేశారు. పదకొండు అక్షౌహిణీల సైన్యం ఆ యుద్ధంలో మరణించారు. తన అత్యాశతో మొత్తం వంశనాశనానికి కారకుడయ్యాడు దుర్యోధనుడు. అందుకే ‘సంతృప్తిని మించిన ధర్మం లేద’ ని పెద్దలు చెప్తారు.
– డా. పురాణపండ వైజయంతి–
గమనిక: మీరూ లైఫ్‌కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే..కథను హామీపత్రంతోపాటు featureseditor@v6velugu.com కి మెయిల్ చేయండి.