Reading Time: 2 minutes
ఫుట్‌పాత్‌ల మీద నిద్ర.. ఆకలి కేకలతో ఏడుపులు..! కట్ చేస్తే ఇండస్ట్రీలో తిరుగులేని నటుడు

సినీ పరిశ్రమలో ఎంతోమంది నటులు జీరో నుండి హీరోలుగా ఎదిగారు. వారిలో ఈ దిగ్గజ నటుడు ఒకరు. సినిమాల్లోకి రాకముందు ఎన్నో కష్టాలను అనుభవించాడు. ఆయన జీవిత ప్రయాణం అత్యంత స్ఫూర్తిదాయకం. అన్నం లేక, డబ్బుల్లేక తీవ్ర కష్టాలను ఎదుర్కొని, అడుగడుగునా ఆకలి, నిరాశలను జయించి ఆయన స్టార్‌డమ్‌ను చేరుకున్నాడు. ఈ కష్టాల కడలిని ఈదుకుంటూ ముందుకు సాగిన ఆయన జీవిత కథ అనేకమందికి ఆదర్శం. ఆయన మరెవరో కాదు.. బాలీవుడ్ లెజెండ్రీ యాక్టర్ మిథున్ చక్రవర్తి. నటుడు మిథున్ చక్రవర్తి బాల్యం, యవ్వనం ఎన్నో సవాళ్లతో కూడుకున్నవి. ఒకానొక సమయంలో ఆయనకు కనీసం తినడానికి తిండి, నిద్రపోవడానికి చోటు కూడా దొరకలేదట. “అన్నం దొరకని సమయాల్లో ఖాళీ కడుపుతో రోజులు గడిపాను. ఆకలి కేకలతో నన్ను నేను తిట్టుకుంటూ, ఏడుస్తూ నిద్రపోయాను. నాకు ఎప్పుడు తిండి దొరుకుతుందా.?, నిద్రపోవడానికి కాస్త చోటు దొరికితే బాగుండు అని ఆలోచిస్తూ భారంగా కాలాన్ని నెట్టుకొచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.  చాలాసార్లు నేను ఫుట్‌పాత్‌ల మీద నిద్రపోయాను” అని ఆయన తన గతాన్ని గుర్తుచేసుకున్నారు.

కేవలం జీవనోపాధి కోసమే పనిచేయాల్సి వచ్చిన సందర్భాలు కూడా ఆయన జీవితంలో ఉన్నాయి. నాలుగు మెతుకుల కోసం పార్టీల్లో డ్యాన్స్ చేసేవాడినని, మంచి డ్యాన్స్ చేయగలిగే విలన్‌గానైనా అవకాశం దొరికితే బాగుంటుందని ఆశించేవాడినని మిథున్ చక్రవర్తి వివరించారు. ఇలాంటి తీవ్రమైన కష్టాల మధ్య, భవిష్యత్తుపై నమ్మకం సన్నగిల్లి, మిథున్ చక్రవర్తి ఒకానొక సమయంలో తన ప్రాణాలే తీసుకోవాలని ఆలోచించారు. తాననుకున్నది సాధించలేనేమో అన్న భయం, కలకత్తాకు తిరిగి వెళ్లలేని పరిస్థితి ఆయన్ను ఆ ఆలోచనకు పురిగొల్పాయి. అయితే, తన జీవితంలో ఎదుర్కొన్న ఈ చీకటి రోజులను గుర్తుచేసుకుంటూ, అందరికీ ఒక విలువైన సలహా ఇచ్చారు. “ఎవరూ జీవితాన్ని ముగించాలనుకోకండి. పోరాడండి. నేను ఫైట్ చేశాను. ఇదిగో ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాను” అని చెప్పుకొచ్చారు.

మిథున్ చక్రవర్తి సినీ ప్రస్థానం 1976లో విడుదలైన మృగయ సినిమాతో ప్రారంభమైంది. ఈ తొలి చిత్రంతోనే ఆయన జాతీయ అవార్డును అందుకుని తన అద్భుత నటనా ప్రతిభను చాటుకున్నారు. ఆ తర్వాత సురక్ష, డిస్కో డాన్సర్ వంటి చిత్రాలతో స్టార్‌డమ్‌ను అందుకున్నారు. ముఖ్యంగా డిస్కో డాన్సర్ సినిమాతో ఆయన దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా డిస్కో కింగ్ గా గుర్తింపు పొందారు. ఈ చిత్రం అప్పట్లో ఒక ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచి, ఆయన కెరీర్‌ను అగ్రస్థానానికి చేర్చింది. డాన్స్ డాన్స్, ప్యార్ ఝుక్తా నహీ, కసమ్ పైదా కర్నే వాలే కీ వంటి అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలతో 80, 90 దశకాల్లో బాలీవుడ్‌లో తిరుగులేని హీరోగా వెలుగొందారు. ఆయన నటన, డ్యాన్స్, ఫైట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కేవలం హిందీ చిత్రాలకే పరిమితం కాకుండా, బెంగాలీ, ఒరియా, భోజ్‌పురి, తమిళం, తెలుగు వంటి ఇతర భాషా చిత్రాలలో కూడా నటించి బహుముఖ నటుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. తెలుగులో పవన్‌కల్యాణ్ నటించిన గోపాల గోపాల సినిమాలో లీలాధర స్వామి పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులను కూడా అలరించారు.

Mithun Chakraborty

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి