
సాయంకాలం తాతయ్య వరండాలో కూర్చుని పుస్తకం చదువుతున్నాడు. ఇంటి ఆవరణలో మనవళ్లు కృతిన్, అద్విక్, అభి, విహాన్ ఆడుకుంటున్నారు. వాళ్లలో ఇద్దరు ఆరో తరగతి, మరో ఇద్దరు ఏడో తరగతి చదువుతున్నారు. అందరూ కలిసి తాతయ్య దగ్గరకు వెళ్లారు.
‘‘రా.. తాతయ్యను కాస్త ఆట పట్టిద్దామా!’’ అని నవ్వుతూ అన్నాడు కృతిన్.
‘‘అవున్రా! వీడియో గేమ్స్ ఎక్కువ ఆడొద్దంటాడు’’ అన్నాడు అద్విక్.
‘‘నిన్న బర్గర్, పిజ్జా తినమంటే.. ‘ఇవి ఆరోగ్యానికి మంచివి కావని చెప్పాడు’’ అన్నాడు అభి.
‘‘మొన్న నాన్నతో కలిసి మార్కెట్ నుంచి వస్తుంటే, నా చేతిలో ఉన్న ప్లాస్టిక్ కవర్ చూసి ‘ఇంట్లో నుంచి వేరే కవర్ తీసుకెళ్లొచ్చు కదా’ అన్నాడు’’ అని గుర్తు చేశాడు విహాన్.
నలుగురూ ఒకరినొకరు చూసుకుని సైగ చేసుకుని నవ్వుకున్నారు. ‘‘తాతయ్యను ఒక ప్రశ్నతో ఇరికిద్దాం!’’ అని నిర్ణయించుకున్నారు.
‘‘తాతయ్యా.. ‘భూతం’ అంటే దెయ్యం కదా?’’ అని అభి అడిగాడు.
తాతయ్య చిరునవ్వుతో తల ఊపాడు.
వెంటనే విహాన్ అడిగాడు, ‘‘మరి ‘పంచభూతాలు’ అంటే..?’’
తాతయ్య పుస్తకం మూసి, పిల్లల వైపు చూస్తూ అన్నాడు.. ‘‘సంస్కృతంలో ‘భూతం’ అంటే కేవలం దెయ్యం మాత్రమే కాదు. ‘ఉన్నది’, ‘ప్రాణి’ అనే అర్థాలూ ఉన్నాయి. భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం.. ఈ ఐదింటినే పంచభూతాలు అంటారు.’’‘‘అయితే మేము అడిగిన భూతం వేరే కదా!’’ అని సందేహంగా అడిగాడు అద్విక్. తాతయ్య నవ్వాడు.
‘‘అవును. ఇప్పుడు నేను చెప్పే పంచభూతాలు మీ జీవితాల్లో తిరుగుతున్నవి. అవి కనిపించవు.. కానీ నెమ్మదిగా మంచి అలవాట్లను దూరం చేస్తాయి.’’పిల్లలందరూ ఆసక్తిగా వింటున్నారు.
‘‘మొదటి భూతం.. జంక్ ఫుడ్. రుచిగా ఉంటుంది కానీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
రెండో భూతం.. వీడియో గేమ్స్‌కు బానిస కావడం. ఆటలు ఆడొచ్చు, కానీ సమయానికి హద్దు ఉండాలి.
మూడో భూతం.. ప్లాస్టిక్ అధికంగా ఉపయోగించడం. అది ప్రకృతికి హాని చేస్తుంది.
నాలుగో భూతం.. క్రమశిక్షణ లేకపోవడం. సమయానికి చదవకపోవడం, నిద్రపోకపోవడం, మాట వినకపోవడం అన్నీ ఇందులోకే వస్తాయి.
ఐదో భూతం.. దుబారా ఖర్చులు. అవసరం లేని వాటికి డబ్బు ఖర్చు చేస్తే, అవసరమైనప్పుడు ఇబ్బందులు వస్తాయి.’’
కొద్దిసేపు నిశ్శబ్దం అలుముకుంది.కృతిన్ మెల్లగా ‘‘తాతయ్యా.. ఈ భూతాలు నిజంగా మన చుట్టూ ఉన్నాయే! మరి ఎలా?’’ అన్నాడు.‘‘అవును’’, అని తాతయ్య చిరునవ్వుతో ‘‘ఈ భూతాలను తరిమేయడానికి మంత్రాలు అవసరం లేదు. మంచి అలవాట్లు ఉంటే చాలు’’ అన్నాడు.
అభి ‘‘ఇకపై జంక్ ఫుడ్ మానేస్తాను.’’
‘‘నేను వీడియో గేమ్స్ జోలికి వెళ్లకుండా ప్రయత్నిస్తాను’’ అన్నాడు అద్విక్.
‘‘నేను ప్లాస్టిక్ కవర్లు వాడను’’ అన్నాడు విహాన్.
‘‘నేను అవసరం లేని ఖర్చులు చేయను’’ అన్నాడు కృతిన్.
తాతయ్య వాళ్ల నలుగురినీ ప్రేమగా దగ్గరకు తీసుకుని, ‘‘అదే నాకు కావాల్సిన సమాధానం. ఒక్కొక్కరు ఒక్కో మాట ఇచ్చారు. కానీ అందరూ అన్నీ పాటిస్తే ఇంకా మంచిది’’ అన్నాడు. ‘‘అలాగే తాతయ్య” అన్నారంతా.
వాళ్ల కాన్ఫిడెన్స్ చూసి.. ‘‘ఇప్పుడర్థమయ్యిందా? చెడు అలవాట్లే అసలు భూతాలు. వాటిని మంచి అలవాట్లతోనే జయించాలి’’ అన్నాడు.ఆ రోజునుంచి ఆ నలుగురు మనవళ్లు ఆ ఐదు భూతాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. మంచి అలవాట్లతో ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడం మొదలుపెట్టారు.
– ఓట్ర ప్రకాష్ రావు-
గమనిక: మీరూ లైఫ్‌కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే..కథను హామీపత్రంతోపాటు featureseditor@v6velugu.com కి మెయిల్ చేయండి.