
జనగామ/ జనగామ అర్బన్/ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తున్నందున రైతులు వరిసాగుకు దూరంగా ఉండాలని జనగామ, భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్లు సందీప్కుమార్ఝా, అంకిత్ సూచించారు. శనివారం జనగామలో సాగునీటి పరిస్థితులు, జలాశయాలు, చెరువుల్లో నీటి నిల్వలు, ఆయకట్టు, నీటి విడుదల ప్రణాళికపై కలెక్టర్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. తక్కువ నీటితో సాగు చేసే పంటలు, ఉద్యాన పంటలు, ఆయిల్‌పామ్‌పై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రిజర్వాయర్లలో 1.5 టీఎంసీల నీరు ఉన్నందున ప్రాధాన్యత క్రమంలో నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. ఈ నెల 15 నుంచి మొదటి విడత, 25 నుంచి రెండో విడతగా సాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.
జిల్లాలో 770 చెరువుల కింద 49,643 ఎకరాల ఆయకట్టు ఉండగా, 763 చెరువుల్లో 0–25 శాతం మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయన్నారు. నర్మెట్ట, బచ్చన్నపేట, పాలకుర్తి, కొడకండ్ల, రఘునాథపల్లి, తరిగొప్పుల మండలాల్లో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకుముందు కలెక్టరేట్‌లోని ఈవీఎం గోడౌన్‌ను నెలవారీ తనిఖీలో భాగంగా పరిశీలించిన కలెక్టర్, భద్రతా రిజిస్టర్, సీసీ కెమెరాలు, నియంత్రణ వ్యవస్థను తనిఖీ చేశారు. భద్రాద్రికొత్తగూడెం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్మాట్లాడుతూ అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని, తాగునీటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జిల్లాలో 1,38,198 ఎకరాలను ప్రత్యామ్నాయ పంటల పరిధిలోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఎల్‌నినో నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.