ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు, కేవలం ఉల్లిపాయలతో చాలా రుచికరమైన, సులభంగా తయారు చేసుకోగల పచ్చడిని సిద్ధం చేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ పచ్చడి ఇడ్లీ, దోస, చపాతీ వంటి అల్పాహారాలకు అద్భుతమైన జతగా ఉంటుంది. అంతేకాకుండా అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి మరో ప్రత్యేకత ఏమిటంటే దీన్ని ఒకసారి తయారు చేసుకుంటే దాదాపు వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ కింద ఉల్లిపాయ పచ్చడి తయారీ విధానాన్ని తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు.. ఉల్లిపాయలు 2 మీడియం సైజు, చింతపండు చిన్న నిమ్మకాయ సైజు, ఎండుమిర్చి 6-8 (మీ కారానికి తగ్గట్టు), ధనియాలు 1 టేబుల్‌స్పూన్, మెంతులు అర టీస్పూన్, పసుపు పావు టీస్పూన్, ఉప్పు రుచికి సరిపడా, నూనె 3 టేబుల్‌స్పూన్లు (వేయించడానికి, తాలింపుకు), కరివేపాకు కొంచెం (పచ్చిది, తాలింపుకు), వెల్లుల్లి రెబ్బలు 4-5 (పొట్టు తీసినవి), తాలింపుకు అదనంగా 5-6 సన్నగా తరిగినవి, ఆవాలు 1 టీస్పూన్ (తాలింపుకు), మినపప్పు 1 టీస్పూన్ (తాలింపుకు), ఇంగువ పావు టీస్పూన్ (తాలింపుకు).. చొప్పున తీసుకోవాలి.
ముందుగా నిమ్మకాయ సైజు చింతపండును ఒక బౌల్లో తీసుకుని, అది మునిగేంత వరకు నీరు పోసి 15-20 నిమిషాలు నానబెట్టాలి. తొందరగా నానాలంటే గోరువెచ్చని నీళ్లు వాడవచ్చు. నానబెట్టిన నీటిని పక్కన పెట్టుకోవాలి. స్టౌ మీద మందపాటి కడాయి పెట్టి, ఒక టీస్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక, ఎండుమిర్చి వేసి లైట్ కలర్ మారే వరకు వేయించాలి. తరువాత ధనియాలు, మెంతులు వేసి, మంటను తగ్గించి దోరగా వేయించాలి. ఇవి మాడిపోకుండా చూసుకోవాలి. వేగిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. అదే కడాయిలో ఒక టేబుల్‌స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక, ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి 20 సెకన్లు వేయించాలి. తరువాత ఒక టీస్పూన్ ఉప్పు వేసి, ఉల్లిపాయలు మెత్తబడి, లేత గోధుమ రంగులోకి మారే వరకు వేయించాలి.
ఉల్లిపాయలు వేగిన తర్వాత, ముందుగా నానబెట్టుకున్న చింతపండును (నీళ్లు తీసి) వేయాలి. పావు టీస్పూన్ పసుపు కూడా కలిపి, చింతపండు మెత్తబడి, ఉల్లిపాయల్లో పూర్తిగా కలిసే వరకు రెండు-మూడు నిమిషాలు వేయించాలి. తరువాత స్టౌ ఆఫ్ చేసి, ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చాలి. చల్లారిన ఎండుమిర్చి మిశ్రమంలో, చింతపండు నానబెట్టిన నీటిని కొద్దిగా వేసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేయాలి. ఆ తరువాత, చల్లారిన ఉల్లిపాయ-చింతపండు మిశ్రమం, కొద్దిగా పచ్చి కరివేపాకు, పొట్టు తీసిన 4-5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా అదనపు ఉప్పు వేసి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే, తాలింపులో నూనె కొంచెం ఎక్కువ వాడాలి. స్టౌ మీద మందపాటి కడాయి పెట్టి, రెండు టేబుల్స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక, ఆవాలు, మినపప్పు వేసి దోరగా వేయించాలి. అవి లైట్ కలర్ మారుతుండగా, రెండు ఎండుమిర్చిని ముక్కలుగా చేసి వేయాలి.
పావు టీస్పూన్ ఇంగువ వేసి, ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి దోరగా వేయించాలి. వెల్లుల్లి లేత గోధుమ రంగులోకి వచ్చాక, కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి. వేగిన తాలింపులో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చడి మొత్తాన్ని వేసి బాగా కలపాలి. తాలింపులోని నూనె పచ్చడికి పట్టి, పచ్చడి పాన్‌కు అంటుకోకుండా వదిలేసే వరకు నిదానంగా వేయించాలి. ఇది పచ్చడిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుతుంది. పచ్చడి చక్కగా కలిసిపోయి, నూనెను పీల్చుకున్న తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే, రుచికరమైన ఉల్లిపాయ పచ్చడి సిద్ధం. దీన్ని ఇడ్లీ, దోస, అన్నంతో వేడివేడిగా వడ్డించవచ్చు. ఈ ఉల్లిపాయ పచ్చడిని ఎయిర్‌టైట్ కంటైనర్‌లో నిల్వ ఉంచవచ్చు. తడి చేతులు, పాత్రలు, స్పూన్లు వాడకుండా చూసుకుంటే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.




