Reading Time: < 1 minute
Anjali Sivaramans Big Break 100 Auditions To Amrita Sher Gil

Anjali Sivaraman: నటి, గాయని అయిన అంజలి శివరామన్ ‘కోబాల్ట్ బ్లూ’ (2022) లో ‘అనూజ’ పాత్ర ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.  అయితే ఆమెకు నెట్‌ఫ్లిక్స్ హిట్‌ సిరీస్ ‘క్లాస్’ (2023) లోని ‘సుహాని అహుజా’ పాత్ర దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 2025లో వెట్రిమారన్ నిర్మించిన ‘బ్యాడ్ గర్ల్’ సినిమాతో తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె, ప్రస్తుతం దర్శకురాలు మీరా నాయర్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక బయోపిక్ ‘ఆమ్రి’లో ప్రసిద్ధ చిత్రకారిణి అమృతా షేర్-గిల్ టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు. అయితే ఈ అవకాశం అంజలికి అంత సులభంగా దక్కలేదని ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. దాదాపు 100 మంది యువతులు ఆ పాత్ర కోసం ఆడిషన్ ఇవ్వగా, చివరకు తనని సెలెక్ట్ చేశారని, మీరా నాయర్ రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్ తనకు ఎంతో ప్రత్యేకమైనదని అంజలి చెబుతున్నారు. మీరా నాయర్ వంటి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకురాలితో కలిసి పనిచేయడం తన కల నెరవేరినట్టేనని, చాలా రోజులుగా ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నట్లు తెలిపారు.

అంజలి శివరామన్ పోషిస్తున్న పాత్ర అమృతా షేర్-గిల్ మన దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఒక గొప్ప మోడ్రన్ పెయింటర్. తండ్రి పంజాబీ సిక్కు, తల్లి హంగేరియన్ మహిళ. 1913లో హంగేరిలో పుట్టిన ఈమె పారిస్‌లో పెయింటింగ్ నేర్చుకుని వెస్ట్రన్ స్టైల్‌ని మన ఇండియన్ ట్రెడిషనల్ స్టైల్‌తో కలిపి అద్భుతమైన బొమ్మలు గీసేవారు. ముఖ్యంగా మన దేశంలోని పల్లెటూరి జనాలు, పేద మహిళల కష్టాలను, వారి దైనందిన జీవితాన్ని తన పెయింటింగ్స్‌లో ఎంతో సహజంగా చూపించేవారు. అందుకే ఈమెను ‘ఇండియన్ ఫ్రిదా కాహ్లో’ అని కూడా పిలుస్తారు. కేవలం 28 ఏళ్ల చిన్న వయసులోనే (1941లో) ఆమె చనిపోయినప్పటికీ, ఆమె గీసిన ‘త్రీ గర్ల్స్’, ‘బ్రహ్మచారీస్’ వంటి పెయింటింగ్స్ ఇండియన్ ఆర్ట్ హిస్టరీలోనే ఎంతో స్పెషల్‌గా నిలిచాయి.  ఇప్పుడు అమృతా షేర్‌గిల్‌గా కనిపించబోతున్న అంజలి శివరామన్‌ కి ‘ఆమ్రి’ ఏ స్థాయిలో గుర్తింపును ఇస్తుందో చూడాల్సిఉంది.