
పెర్త్: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత మహిళ జట్టు ఘోరంగా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో రాణించిన ఆసీస్ మహిళ జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఆస్ట్రేలియాకు 25 పరుగుల టార్గెట్‌ను ఇచ్చింది. ఈ టార్గెట్‌ని వికెట్ కోల్పోకుండా 28 పరుగులు చేసి ఆస్ట్రేలియా చేధించింది. ఆసీస్ బ్యాటింగ్‌లో జార్జియా 16 (13 బంతుల్లో, 4 ఫోర్లు), లిచ్‌ఫీల్డ్ 11 (14 బంతుల్లో, 1 ఫోర్) పరుగులు చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆటని 105/6 పరుగుల ఔట్ నైట్ స్కోర్‌తో ప్రారంభించిన భారత్.. 149 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బ్యాటింగ్‌లో ప్రతీకా రావల్ (63) ఒంటరి పోరాటం చేయగా.. స్నేహ్ రాణా (30) పరుగులు చేసింది. మిగితా బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. ఆసీస్ బౌలింగ్‌లో హామిల్టన్ 3, అన్నాబెల్, అలానా కింగ్, నార్డ్‌నర్ తలో రెండు వికెట్లు తీశారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 198 పరుగులు చేసి ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 323 పరుగులు చేసింది.