
ముంబై: వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది.. అయితే ఈ మ్యాచ్‌లో భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తేలిపోయాడు. 4 ఓవర్ల ఒక వికెట్ మాత్రమే తీసి ఏకంగా 64 పరుగులు సమర్పిచుకున్నాడు. ఈ నేపథ్యంలో టీం ఇండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ పలు సూచనలు చేశాడు. వరుణ్‌లో అత్మ విశ్వాసం లోపించిందని.. అతడికి ప్రాక్టీస్ సెషన్ అవసరం లేకుండా నేరుగా ఫైనల్స్‌లో ఆడించాలని పఠాన్ పేర్కొన్నాడు.
‘‘భారత్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడాల్సి ఉంది. టీం ఇండియా తన ప్రణాళికలను జాగ్రత్తగా సిద్ధం చేసుకోవాలి. వరుణ్ చక్రవర్తిని తిరిగి సరైన మానసిక స్థితిలోకి (ఫ్రేమ్ ఆఫ్ మైంఢ్) తీసుకురావాలి. ప్రస్తుతం అతడిలో ఆత్మవిశ్వాసం కాస్త సన్నగిల్లినట్లు కనిపిస్తోంది. నేను భారత శిబిరంలో ఉంటే వరుణ్ చక్రవర్తిని రెండు రోజులు అన్నింటికీ దూరంగా ఉంచుతా. ఎక్కువ మంది అతడితో మాట్లాడే అవకాశం ఇవ్వను. అతడిని ఫ్రెష్ మైండ్, పాజిట్ ఎనర్జితో మైదానంలో అడుగుపెట్టేలా చూస్తా. ఒక రోజు ప్రాక్టీస్ చేయకపోతే.. నష్టమేమీ లేదు’’ అని పఠాన్ పేర్కొన్నాడు.