Reading Time: < 1 minute

విద్యార్థినులను కరిచిన ఎలుకలు..ఎర్రగట్టుగుట్ట గురుకుల హాస్టల్లో ఘటన

Caption of Image.

హసన్‌‌పర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా హసన్‌‌పర్తి మండలకేంద్రంలోని ఎర్రగట్టుగుట్ట ప్రాంతంలో ఉన్న తెలంగాణ బాలికల గురుకుల హాస్టల్‌‌లో ఎలుకల దాడిలో విద్యార్థినులు గాయపడ్డారు. గురుకుల హాస్టల్‌‌లోని డార్మెటరీలో విద్యార్థినులు బుధవారం రాత్రి నిద్రిస్తున్నారు. ఈ సమయంలో రోహిణి ప్రియ, సోను సాయి, సంకీర్తన అనే విద్యార్థినుల కాళ్లు, చేతులను ఎలుకలు కొరికాయి.

తీవ్ర రక్తస్రావం జరగ్గా హాస్టల్ యాజమాన్యం వారికి ప్రథమ చికిత్స అందించి.. గురువారం ఉదయం హసన్‌‌పర్తి పీహెచ్​సీకి తరలించారు. అక్కడ డాక్టర్లు రక్తపరీక్షలు నిర్వహించి చికిత్స అందించిన తరువాత తిరిగి హాస్టల్‌‌కు పంపించారు. పీహెచ్​సీ డాక్టర్ భరత్ రెడ్డి వైద్య సిబ్బందితో కలిసి హాస్టల్‌‌ను సందర్శించి డైనింగ్ హాల్, డార్మెటరీలను పరిశీలించారు.

హాస్టల్‌‌లో ఎలుకల సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ యాజమాన్యం ఇప్పటి వరకు కిటికీలు, గదుల భద్రతపై సరైన చర్యలు తీసుకోలేదని విద్యార్థినులు ఆరోపించారు. హాస్టల్ చుట్టూ పాములు, ఎలుకలు, కుక్కలు తిరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గదుల్లోకి విషకీటకాలు రాకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
 

©️ VIL Media Pvt Ltd.