Reading Time: 2 minutes

 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల దరిదాపుల్లో అత్యంత నాటకీయ పరిణామం జరిగింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద బోస్ గురువారం రాజీనామా చేశారు. ఇదే సమయంలో లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తా కూడా తమ పదవికి రాజీనామా చేశారు. ఆయన జమ్మూ కశ్మీర్‌కు చెందిన సీనియర్ బిజెపి నేతగా సేవలు అందించారు. ఉన్నట్లుండి ఇద్దరు రాజ్యపాలకుల రాజీనామాల సమర్పణ జాతీయ స్థాయిలో ప్రకంపనలకు దారితీసింది. అయితే ఇది హోం మంత్రి అమిత్ సా వ్యూహాత్మక కదలిక అని రాజకీయ వర్గాలు తెలిపాయి. గురువారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో ముందుగా బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ తమ రాజీనామా ప్రకటించారు. రాజీనామాకు దారితీసిన కారణాలను ఆనంద్ వెల్లడించలేదు. తన రాజీనామా వెనుక ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా? వ్యక్తిగత కారణాలు ఇందుకు దారితీశాయా? అనేది ఆయన వెల్లడించలేదు.

గురువారం ఉదయమే ఆనంద బోస్ రాష్ట్రపతికి తమ రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ప్రస్తుత పరిణామంపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ ముందు విస్మయం వ్యక్తం చేశారు.పలు విషయాలపై బెంగాల్‌లో ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు విభేదాలు అనేక దశల్లో ఉద్రిక్తతలకు దారితీశాయి. రాజ్‌భవన్ , సిఎం ఆఫీసు మధ్య హోరాహోరి పరిస్థితి ఏర్పడ్డ సందర్భాలు ఉన్నాయి. గవర్నర్ రాజీనామా తనకు దిగ్భ్రాంతి కల్గించిందని మమత బెనర్జీ తెలిపారు. తనకు తెలిసిన దాని ప్రకారం తమిళనాడు గవర్నరు ఆర్‌ఎన్ రవి ప్రస్తుతానికి బెంగాల్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు తీసుకుంటారని, అయితే ఈ విషయం నిర్థారణ కాలేదని మమత విలేకరులకు తెలిపారు. హోం మంత్రి అమిత్ షా సూచనప్రాయంగా ఈ విషయం చెప్పారని వివరించారు. బోస్ బెంగాల్ గవర్నర్‌గా 2022 నవంబర్ 17న నియమితులు అయ్యారు. మూడున్నర ఏండ్లు రాష్ట్ర గవర్నర్‌గా ఉన్నానని, ఇక చాలునని బోస్ తమ రాజీనామా ధృవీకరణ సందర్భంగా మీడియాకు తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికల దశలో రాజకీయ ఒత్తిళ్లతోనే ఆనంద బోస్ పదవి నుంచి వైదొలిగినట్లు వార్తలు వెలువడ్డాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒత్తిడితోనే ఆనంద బోస్ రాజీనామా చేశారని మమత బెనర్జీ విమర్శించారు. ఇంతకు మించి దీనిపై ఎక్కువగా స్పందించలేదు. తమకు గవర్నర్‌తో వివాదాలు ఉన్నప్పటికీ రాజీనామాలు, నియమాకాల విషయంలో కేంద్రం పూర్తిస్థాయిలో కాకపోయినా కొంతైనా సమాఖ్యవాదం పాటించాల్సి ఉందని మమత బెనర్జీ మోడీ సర్కారుపై పనిలో పనిగా మండిపడ్డారు.కాగా ఇప్పుడు రాజీనామాకు దిగిన లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తా గత ఏడాది జులైలో ఈ పదవికి వచ్చారు. గుప్తా జమ్మూ కశ్మీర్‌కు చెందిన బిజెపి సీనియర్ నాయకుడు. పార్టీకి గడ్డుపరిస్థితుల్లోనూ సేవలందించారు. గతంలో జమ్మూ కశ్మీర్ ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు.