Reading Time: < 1 minute

 తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. క్రిస్‌మస్ సెలవు, వీకెండ్ కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండి, శిలాతోరణం వరకు క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. శ్రీవారి ఆలయ పరిసరాలు, వసతి సముదాయాలు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి సుమారు 24 గంటలు సమయం పడుతుంది. టైమ్ స్లాట్ దర్శనానికి సుమారు 8 గంటలు, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.

 తిరుపతిలోని అలిపిరి దగ్గర భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. అలిపిరి చెక్ పాయింట్ దగ్గర పెద్ద ఎత్తున వాహనాలు బారులు తీరాయి. కౌస్తుభం గెస్ట్ హౌస్ లో చికెన్ బిరియాని, కోడి గుడ్లు బయటపడటంతో వాహనాల తనిఖీని మరింత పెంచారు. తనిఖీల విషయంలో భద్రతా వైఫల్యాలు బయటపడుతున్న క్రమంలో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో చెక్ పాయింట్ దగ్గర ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా భద్రతా సిబ్బంది చెక్ చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన భక్తులు శ్రీవారి ఆలయం ముందు పొలిటికల్ బ్యానర్ ప్రదర్శించడంపై సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో నిషేధిత వస్తువులు తిరుమలకు వెళ్లకుండా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో టోల్ గేట్ నుండి అలిపిరి ఆర్చ్ వరకు భారీ సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి.