
బషీర్‌బాగ్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారులకు హైకోర్టు పెన్షన్ ఆదేశాలు జారీ చేయడం చారిత్రాత్మక పరిణామమని జస్టిస్ చంద్రకుమార్ తెలిపారు. ఉద్యమకారుల త్యాగాలకు ఇది గుర్తింపుగా నిలుస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ప్రొఫెసర్ ననుమాస స్వామి అధ్యక్షతన నిర్వహించిన తొలి తెలంగాణ ఉద్యమకారుల విజయోత్సవ సభకు ఆయన చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు.
తెలంగాణ చరిత్రలో సాయుధ పోరాటం నుంచి రాష్ట్ర సాధన ఉద్యమం వరకు అనేక పోరాటాలు జరిగాయని తెలిపారు. తొలి తెలంగాణ ఉద్యమంలో పోలీసు కాల్పుల్లో 369 మంది చనిపోతే.. మలి దశ ఉద్యమంలో 1,200 మంది ఆత్మబలిదానాలు చేశారని గుర్తు చేశారు. ఇంతటి త్యాగాలు జరిగినప్పటికీ ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వారికి తగిన ప్రయోజనాలు దక్కలేదన్నారు.
ఉద్యమకారులకు పెన్షన్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు వారి త్యాగాలకు న్యాయపరమైన గుర్తింపు కల్పించాయని తెలిపారు. కోర్టు ఆదేశాలు పొందిన ఉద్యమకారులకు హైడ్రా సేకరించిన భూములను కేటాయిస్తే వారి త్యాగాలకు మరింత గౌరవం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.
పాశం యాదగిరి, మాడభూషి శ్రీధరాచార్యులు, తెలంగాణ విఠల్ మాట్లాడుతూ.. పోరాట ఫలితంగానే హైకోర్టు 49 మంది తొలి తెలంగాణ ఉద్యమకారులకు పెన్షన్ మంజూరు చేయాలని ఆదేశించిందని చెప్పారు. ననుమాస స్వామి న్యాయవాదిగా ఉద్యమకారులకు పెన్షన్, భూమి, రిజర్వేషన్ల కోసం పోరాడడం అభినందనీయమన్నారు. అనంతరం పెన్షన్ పొందుతున్న 49 మంది ఉద్యమకారులను శాలువాలతో సత్కరించారు.