Reading Time: 2 minutes

అమెరికాలో తెలుగు గ్రీన్‌కార్డ్ హోల్డర్ అరెస్ట్.. కోర్టు తీర్పును పట్టించుకోని ఇమ్మిగ్రేషన్ అధికారులు

Caption of Image.

అమెరికా గడ్డపై సుమారు 3 దశాబ్దాలుగా ఉపాధ్యాయురాలిగా, బాధ్యతాయుతమైన పౌరురాలిగా ప్రశాంత జీవితాన్ని గడుపుతున్న ఓ తెలుగు మహిళ ప్రస్తుతం కటకటపాలపాలయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా అమలాపురం సమీపంలోని ఓ గ్రామానికి చెందిన వెంకట నరసమాంబ వాసమసెట్టి ప్రస్తుతం అమెరికాలోని ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అదుపులో ఉన్నారు. ఒకవైపు కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చి గ్రీన్ కార్డ్ హోల్డర్ గా నిలబెట్టినా, ఇమ్మిగ్రేషన్ అధికారుల తీరు మాత్రం ఆమె కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేస్తోంది.

ఆమె 1999లో సాఫ్ట్‌వేర్ నిపుణుడైన భర్తతో కలిసి అమెరికాకు వలస వెళ్లారు. వేక్ కౌంటీ పబ్లిక్ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా సేవలందించిన ఆమె.. ఇద్దరు కుమార్తెలను ఉన్నత చదువులు చదివించారు. ప్రస్తుతం వారి పిల్లలు డాక్టర్లుగా, ఇమ్మిగ్రేషన్ లాయర్లుగా స్థిరపడ్డారు. అందరూ అమెరికన్ పౌరులే. అయితే జూలై 2022లో అనారోగ్యంతో ఉన్న తండ్రిని చూసేందుకు భారత్‌కు వచ్చిన ఆమెకు.. అనుకోకుండా కొవిడ్ సోకడంతో అమెరికా తిరుగు ప్రయాణంలో 6 నెలల కంటే ఎక్కువ ఆలస్యం జరిగింది. ఈ చిన్న సాంకేతిక కారణమే ఆమె జీవితంలో ఊహించని కష్టాన్ని తెచ్చిపెట్టింది. 

అమెరికా చేరుకున్న నరసమాంబకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ నుంచి ఊహించని షాక్ తగిలింది. ఎక్కువ కాలం అమెరికా బయట ఉండటం వల్ల ఆమె పర్మనెంట్ రెసిడెంట్ హోదాను కోల్పోయారని అధికారులు వాదించారు. అయితే ఆమె తరఫు లాయర్లు కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. ఆమెకు అమెరికాను విడిచిపెట్టే ఉద్దేశం లేదని నిరూపించారు. ప్రభుత్వ అధికారులు సరైన సాక్ష్యాలను సమర్పించలేకపోవడంతో.. మే 19న ఇమ్మిగ్రేషన్ జడ్జి ఆ కేసును కొట్టివేశారు. ఆమె చట్టబద్ధమైన గ్రీన్ కార్డ్ హోల్డర్‌గా కొనసాగుతారని స్పష్టం చేస్తూ దేశ బహిష్కరణ చర్యలను పూర్తిగా రద్దు చేశారు.

కోర్టు తీర్పు వెలువడినప్పటికీ.. ఇమ్మిగ్రేషన్ అధికారుల తీరులో మాత్రం మార్పు రాలేదు. తదుపరి చెక్-ఇన్‌ల కోసం ఆమె కార్యాలయానికి వెళ్లినప్పుడు రికార్డులు అప్‌డేట్ కాలేదనే సాకుతో అధికారులు వేధించారు. చివరికి ఆగస్టు 11న తన కుమార్తెతో కలిసి షార్లెట్ ఐసీఈ ఆఫీసుకు వెళ్లిన నరసమాంబను అధికారులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి జార్జియాలోని వివాదాస్పద ఇర్విన్ కౌంటీ డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. జడ్జి ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ అధికారులు ఈ చర్య తీసుకోవడంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం నరసమాంబ ఇన్సులిన్-పై ఆధారపడే డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. ఆమెకు నిత్యం కఠినమైన వైద్య పర్యవేక్షణ, తగిన ఆహారం అవసరం. కానీ డిటెన్షన్ సెంటర్‌లో ఆమెకు సరైన వైద్యం అందడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ అన్యాయంపై పోరాడేందుకు వారు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, విదేశాంగ శాఖను ఆశ్రయించారు. న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ ఓ వృద్ధురాలిని ఇలా నిర్బంధించడంపై మానవ హక్కుల సంఘాలు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. నరసమాంబను వెంటనే విడుదల చేయాలని ఆమె కుటుంబం డిమాండ్ చేస్తోంది.

©️ VIL Media Pvt Ltd.