Reading Time: < 1 minute

అత్తింటి వేధింపులతో రక్షణ శాఖ ఆఫీసర్ సూసైడ్.. భర్త, అత్తమామలపై కేసు

Caption of Image.

న్యూఢిల్లీ: రక్షణ మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్‌‌‌‌వో)గా పనిచేస్తున్న నాజియా ఖానమ్ అనుమానాస్పద రీతిలో మరణించారు. ప్రస్తుతం గర్భంతో ఉన్న ఖానమ్ ఆసుపత్రికి చెకప్ కోసం వెళ్లి వచ్చిన తర్వాత ఇంట్లోనే విగతజీవిగా మారారు. పోలీసుల వివరాల ప్రకారం.. నాజియా ఖానమ్‌‌‌‌కు ఈ ఏడాది ఏప్రిల్ 11న గుర్‌‌‌‌గావ్‌‌‌‌లో సప్లై చైన్ మేనేజర్‌‌‌‌గా పనిచేసే మహమ్మద్ ఆజం అలీ ఖాన్‌‌‌‌తో వివాహమైంది. ప్రస్తుతం ఆమె 3 నెలల గర్భిణి. చెకప్​కోసం ఆస్పత్రికి వెళ్లొచ్చిన తర్వాత భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. 

అనంతరం నాజియా తన భర్తను ఒక గదిలో బంధించి, తాను మరొక గదిలోకి వెళ్లి ఉరివేసుకుని చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌‌‌‌కు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌‌‌‌డీఎం పర్యవేక్షణలో మృతదేహాన్ని డీడీయూ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటన జరిగిన తొలిరోజు కుటుంబ సభ్యులు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. 

అయితే, మరుసటి రోజు మృతురాలి తల్లిదండ్రులు ఎస్‌‌‌‌డీఎంను కలిసి భర్త, అత్తమామలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. భర్త ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించడం  వల్లనే ఆమె ఈ దారుణానికి ఒడిగట్టిందని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఖానమ్ భర్త, అత్తమామలపై గృహహింస కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. వరకట్న వేధింపుల చట్టం కూడా జోడించాలని మృతురాలి కుటుంబం కోరుతోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు.
 

©️ VIL Media Pvt Ltd.