
Amaravati Energy Stations: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.. రాజధానిలో ఆధునిక మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా ఏడు ఎనర్జీ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) చర్యలు చేపట్టింది. ఎనర్జీ స్టేషన్ల ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించింది. ఇందుకోసం మొత్తం 18.25 ఎకరాల భూమిని కేటాయించారు. అనంతవరంలో ఒకటి, కురగల్లులో మూడు, నేలపాడులో రెండు, వెలగపూడిలో ఒక ఎనర్జీ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ స్టేషన్లలో ఎలక్ట్రిక్ వాహనాలకు 24 గంటల పాటు ఛార్జింగ్ సదుపాయం అందుబాటులో ఉండనుంది. సెక్రటేరియట్, అసెంబ్లీ, జ్యుడీషియరీకి సంబంధించిన వాహనాలకు కూడా ప్రత్యేకంగా ఈ సదుపాయాలను వినియోగించే అవకాశం కల్పించనున్నారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైడ్రోజన్ వాహనాలకు ఇంధనం అందించేలా ఎనర్జీ స్టేషన్లను డిజైన్ చేయనున్నారు. DBFOT విధానంలో ఈ స్టేషన్లను 33 ఏళ్ల పాటు నిర్వహించేందుకు అవకాశం కల్పించనున్నారు. అవసరాన్ని బట్టి మరో 33 ఏళ్ల పాటు నిర్వహణ కాలాన్ని పొడిగించే వెసులుబాటు కూడా ఉంటుంది. మరోవైపు.. మంత్రి నారాయణ నేడు అమరావతిలో పర్యటించనున్నారు. రాజధాని నిర్మాణ పనులతో పాటు క్వాంటం వ్యాలీ నిర్మాణ పురోగతిని మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. పనుల ప్రస్తుత స్థితి, పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. నిర్మాణ పనుల్లో ఎదురవుతున్న సమస్యలను అధికారులతో చర్చించడంతో పాటు, నిర్దేశిత గడువులో పనులను పూర్తి చేసేలా అధికారులకు మంత్రి నారాయణ దిశానిర్దేశం చేయనున్నారు. అమరావతిని ‘డీప్ టెక్ క్యాపిటల్’గా అభివృద్ధి చేయాలన్న ప్రణాళికలో క్వాంటం వ్యాలీ కీలక భాగంగా ప్రభుత్వం భావిస్తోంది.