
ప్రేమ్ సాగర్ కుటుంబంలో ఆర్థిక బాధ్యతలు, చెల్లెలి ఇంజనీరింగ్ విద్య వంటి కారణాలతో ఆయనే ఇంట్లో బ్రెడ్ ఎర్నర్. సివిల్స్ ప్రిపరేషన్ కోసం కనీసం రెండేళ్లు ఖర్చు ఉంటుందని, ఒకవేళ విజయం సాధించకపోతే పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు ఆయనను వెంటాడాయి. ఈ నిర్ణయం గురించి కుటుంబ సభ్యులకు చెప్పినప్పుడు, తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. తండ్రి, తల్లి, బంధువులు సైతం ‘పిచ్చా?’, ‘అవసరమా?’ అంటూ ప్రశ్నించారు. ‘మన బ్యాక్‌గ్రౌండ్‌కి, మనకి అస్సలు నమ్మకం లేదు, మనకెవరూ గ్రాడ్యుయేషన్ లేదు, ఎవరూ సపోర్ట్ చేస్తారు, గైడెన్స్ ఇస్తారు?’ అని నిరుత్సాహపరిచారు. ఈ వాదోపవాదాలు దాదాపు 15 నుండి 20 రోజులపాటు ఇంట్లో జరిగాయి. చివరకు తండ్రి ఒక షరతు పెట్టారు. ‘ఉద్యోగం వదిలి ఆరు నెలలు పూర్తిగా ప్రిపేర్ అవ్వు. జూన్‌లో జరిగే ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే మరో ఏడాదిన్నర సమయం ఇస్తాను. ఒకవేళ ప్రిలిమ్స్ క్లియర్ కాకపోతే తిరిగి ఉద్యోగంలో చేరాలి’ అని స్పష్టం చేశారు. ప్రేమ్ సాగర్ ఈ వ్యతిరేకత సమంజసమే అని అంగీకరించారు, ఎందుకంటే తాను వారి స్థానంలో ఉన్నా అదే దృక్పథంతో ఉండేవాడినని చెప్పారు. ఆ షరతు తనకు కూడా న్యాయంగానే అనిపించిందని దీంతో 2017 డిసెంబర్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసి, 2018 జనవరిలో ప్రేమ్ సాగర్ సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించారు.
రోజుకు 11 గంటలు స్టడీ హాల్‌లోనే.. కోచింగ్ లేకుండానే తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్ క్లియర్
సివిల్స్ గురించి పెద్దగా అవగాహన లేకపోయినా ప్రిలిమ్స్ ఎలా క్లియర్ చేయాలనే లక్ష్యంతోనే సిద్ధమయ్యారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఇంటికి సమీపంలో ఉన్న స్టడీ హాల్‌లో చేరారు. ఉదయం 9 గంటలకు స్టడీ హాల్‌కు వెళ్లి రాత్రి 8 గంటల వరకు చదివేవారు. అప్పటికి మెయిన్స్, ఆప్షనల్ సబ్జెక్ట్, ఆన్సర్ రైటింగ్ వంటి అంశాలపై స్పష్టమైన అవగాహన లేదు. ఒక స్నేహితురాలు ఇప్పటికే సివిల్స్‌కు సిద్ధమవుతుండటంతో ఆమెను అడిగి అవసరమైన వెబ్‌సైట్లు, స్టడీ మెటీరియల్, ప్రిపరేషన్ విధానం గురించి సమాచారాన్ని సేకరించేవారు. అలా 2018 జూన్‌లో తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్ పరీక్ష రాశారు. ఆ పరీక్ష ఫలితం జూలైలో వచ్చింది. ఆరు నెలల ప్రిపరేషన్, ఎలాంటి కోచింగ్ లేకుండానే ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించడంతో ప్రేమ్ సాగర్ తనకే ఆశ్చర్యం కలిగిందని తెలిపారు. ఈ ఫలితం కుటుంబ సభ్యుల్లోనూ నమ్మకాన్ని పెంచింది. ‘మా అబ్బాయి అనుకున్నది సాధిస్తాడు’ అనే విశ్వాసం వారికి కలిగిందని ఆయన గుర్తుచేసుకున్నారు.
ఆప్షనల్ ఎంపికలోనూ స్పష్టత లేదు.. మెయిన్స్‌కు 2 నెలలే.. అప్పుడే అసలు భయం
ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాతే ఆప్షనల్ సబ్జెక్ట్ ఎంపికపై దృష్టి పెట్టారు. హిస్టరీ అంటే ఇష్టం ఉండటంతో మొదట హిస్టరీని ఆప్షనల్‌గా తీసుకోవాలని అనుకున్నారు. అయితే గత ప్రశ్నపత్రాలను పరిశీలించినప్పుడు ఒక్క ప్రశ్న కూడా అర్థం కాకపోవడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. తనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ (IR)పై ఆసక్తి ఉండటంతో పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ను ఆప్షనల్‌గా ఎంచుకున్నారు. అయితే అప్పటికీ సబ్జెక్ట్‌పై పూర్తి అవగాహన లేదు. ప్రిలిమ్స్ ఫలితం వచ్చిన తర్వాత మెయిన్స్‌కు కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఆప్షనల్ సబ్జెక్ట్‌ను ఒక నెలలో పూర్తిచేసి, మరో నెల చదివి మెయిన్స్ రాసేయవచ్చని మొదట భావించారు. కానీ ప్రిపరేషన్ అంత సులభం కాదని త్వరగానే అర్థమైంది. దీంతో హైదరాబాద్‌లో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సివిల్స్ కోచింగ్ అందిస్తున్న బాలలత వద్ద పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆప్షనల్ కోచింగ్‌లో చేరారు. కోచింగ్‌తో పాటు స్వయంగా కూడా సిద్ధమయ్యారు.
ఆప్షనల్‌లో 275 మార్కులు
మెయిన్స్‌కు సమయం తక్కువగా ఉండటంతో జనరల్ స్టడీస్‌ను పక్కనపెట్టి ఆప్షనల్‌పై ఎక్కువగా దృష్టి పెట్టారు. కోచింగ్‌లో నిర్వహించిన పరీక్షలను సీరియస్‌గా తీసుకున్నారు. ఆ కృషి ఫలించింది. తొలి ప్రయత్నంలో ఆప్షనల్‌లో ఏకంగా 275 మార్కులు సాధించారు. అయితే మెయిన్స్‌లో మొత్తం కట్‌ఆఫ్‌కు సుమారు 30 మార్కుల తేడాతో ఇంటర్వ్యూకు అర్హత సాధించలేకపోయారు. తొలి ప్రయత్నంలో మెయిన్స్ మిస్ కావడం ఆయనను నిరుత్సాహపరచలేదు. ‘కేవలం 30 మార్కుల తేడాతోనే ఆగిపోయాను. ఇంకొంచెం కష్టపడితే సాధ్యమే’ అనే నమ్మకం మరింత పెరిగింది. అదే సమయంలో తొలి ప్రయత్నంలో చేసిన తప్పులు స్పష్టంగా అర్థమయ్యాయి. ముఖ్యంగా ఆన్సర్ రైటింగ్, టైమ్ మేనేజ్‌మెంట్, పేపర్ పూర్తి చేయడం ఎంత ముఖ్యమో తెలుసుకున్నారు. మొదటి మెయిన్స్ పరీక్షలో మూడు గంటల్లో 20 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉండగా కేవలం 17 ప్రశ్నలను మాత్రమే పూర్తి చేయగలిగారు. మూడు ప్రశ్నలను పూర్తిగా రాయకపోవడం వల్ల మంచి మార్కులు కోల్పోయినట్లు ప్రేమ్ సాగర్ తెలిపారు. ‘ఆ మూడు ప్రశ్నలు కూడా పూర్తి చేసి ఉంటే కట్‌ఆఫ్ దాటే అవకాశం ఉండేది’ అని ఆయన విశ్లేషించుకున్నారు. దీంతో రెండో ప్రయత్నంలో ప్రధానంగా ఆన్సర్ రైటింగ్, పేపర్ కంప్లీషన్, టైమ్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టారు.
రెండో ప్రయత్నంలో పూర్తి విజయం
తొలి ప్రయత్నంలో చేసిన తప్పులను గుర్తించి, రెండో ప్రయత్నానికి వ్యూహాన్ని పూర్తిగా మార్చుకున్నారు. ఎక్కువగా టెస్టులు రాశారు. మూడు గంటల్లో మొత్తం పేపర్‌ను పూర్తి చేసేలా నిరంతరం ప్రాక్టీస్ చేశారు. మెయిన్స్ పరీక్షలో సమయపాలన, ఆన్సర్ రైటింగ్ కీలకమని గ్రహించి దానికి అనుగుణంగా సిద్ధమయ్యారు. ఈ మార్పులు ఫలించాయి. రెండో ప్రయత్నంలో ప్రిలిమ్స్, మెయిన్స్ సహా అన్ని దశలను విజయవంతంగా అధిగమించి సివిల్స్‌లో ప్రేమ్ సాగర్ విజయం సాధించారు. అలా యూపీఎస్సీ సివిల్స్‌లో ఏకంగా 170వ ర్యాంకు కొట్టారు. ఈ ప్రయాణం ద్వారా ఒక విషయం స్పష్టమవుతుంది. ప్రిపరేషన్‌కు సరైన మార్గదర్శకత్వం ఉపయోగపడినా, ఆత్మవిశ్వాసం, నిరంతర కృషి, తప్పుల నుంచి నేర్చుకునే గుణం, సమయపాలన ఉంటే లక్ష్యాన్ని సాధించవచ్చని ఆయన ప్రయాణం నిరూపించింది.