Reading Time: < 1 minute
Rambha Urvashi Menaka Trailer Allari Naresh Nagarjuna

Rambha Urvashi Menaka Trailer: చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా కింగ్ నాగార్జున లాంచ్ చేశారు. ట్రైలర్‌ విషయానికొస్తే.. సూరి పాత్రలో అల్లరి నరేష్ తనదైన శైలిలో అలరించారు. మొక్కుబడుల కారణంగా రంభ, ఊర్వశి, మేనక భూలోకానికి దిగిరాగా.. వారు తమ దివ్య శక్తులను కోల్పోవడంతో కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ముగ్గురు అప్సరసలు సూరి ఇంట్లోకి రావడంతో అతడు ఎదుర్కొనే సమస్యలు, ప్రేయసితో గొడవలు, పోలీసుల విచారణ, ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న తల్లి.. ఇలా వరుస ట్విస్ట్‌లను పూర్తిస్థాయి వినోదంతో ట్రైలర్‌లో నింపారు.

ట్రైలర్‌ను చూస్తే డైరెక్టర్ చంద్ర మోహన్ చింతాడ ఈ సినిమాను ఆద్యంతం కామెడీతో నడిపించినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా అల్లరి నరేష్, నరేష్ వీకే మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన ‘లవ్ యూ బచ్చెస్’ డైలాగ్‌ను కూడా ఈ ట్రైలర్‌లో సరదాగా ఉపయోగించారు. అలాగే ‘ఓజీ’లోని జపనీస్ డైలాగ్‌ను కామెడీగా వాడుతూ ట్రైలర్‌కు ఫన్నీ ఎండింగ్ ఇచ్చారు. అల్లరి నరేష్ మరోసారి తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. అమాయకత్వం, ఎనర్జీ, హాస్యాన్ని కలగలిపిన ఆయన పాత్ర సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. సురభి హీరోయిన్‌గా నటించగా.. రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ ముగ్గురు అప్సరసలుగా కనిపించనున్నారు. వెన్నెల కిషోర్ ఇంద్రుడి పాత్రలో నవ్వులు పూయించగా.. నరేష్ వీకే, శ్రీనివాస్ రెడ్డి, రచ్చ రవి, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మొత్తంగా ఈ ట్రైలర్ చూస్తే.. పల్లెటూరి హాస్యం, పురాణ నేపథ్యం, ఫాంటసీ అంశాలను కలిపి డిఫరెంట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ‘రంభ ఊర్వశి మేనక’ సినిమాను తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. అల్లరి నరేష్ తన కామెడీ జానర్‌లో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైనట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది.