Reading Time: < 1 minute
Us Iran Ceasefire Deal Strait Of Hormuz Shipping

Iran-US Ceasefire: అమెరికా, ఇరాన్ మధ్య పతాక స్థాయికి చేరిన ఉద్రిక్తతలకు త్వరలోనే తెరపడనున్నట్లు తెలుస్తోంది. రష్యన్ వార్తా సంస్థ RIA నోవోస్టి తెలిపిన వివరాల ప్రకారం.. ఇరు దేశాలు కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) ఒప్పందానికి సూత్రప్రాయంగా అంగీకరించాయి. పాకిస్తాన్ సైనిక అధికారులు, ఇరాన్ భద్రతా వర్గాలను ఉటంకిస్తూ ఈ సంచలన కథనాన్ని వెలువరించింది. ఈ ప్రతిపాదిత ఒప్పందంలో ప్రధానంగా ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ (హోర్ముజ్ జలసంధి) ద్వారా నౌకల స్వేచ్ఛా రవాణాకు అనుమతించడం అత్యంత కీలకమైన అంశంగా మారింది. ఈ జలసంధి అంతర్జాతీయ వాణిజ్యానికి, ముఖ్యంగా ప్రపంచ చమురు, ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన సముద్ర మార్గం. ఈ మార్గంలో వివాదాలే ఇరు దేశాల మధ్య ఘర్షణకు ప్రధాన కారణమైన నేపథ్యంలో, ఇక్కడ రాకపోకలు పునఃప్రారంభమైతే అంతర్జాతీయ ఇంధన విపణికి పెద్ద ఊరట లభించనుంది. త్వరలోనే ఈ ఒప్పందానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి. కానీ.. అమెరికా లేదా ఇరాన్ ప్రభుత్వాలు ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక స్పష్టత ఇవ్వలేదు. ఈ సీజ్‌ఫైర్ ఒప్పందం కనుక అమల్లోకి వస్తే, పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులు సదుమణిగి, గ్లోబల్ ట్రేడ్ మళ్లీ యథాస్థితికి చేరుకుంటుందని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు.