Reading Time: < 1 minute
Alluarjun Raaka Aishwarya Lekshmi Atlee Movie Cast Update

Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘రాకా’. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ బయటికి వచ్చిన సోషల్ మీడియాలో మామూలు రచ్చ చేయడం లేదు. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ రోజురోజుకి ఆసక్తి పెరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమాలో దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్, రకుల్ ప్రీత్ సింగ్, జాన్వీ కపూర్ పేర్లు వినిపిస్తుండగా.. తాజాగా మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి కూడా ఈ సినిమాలో భాగం కానున్నారనే ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ‘రాకా’లో ఐశ్వర్య లక్ష్మి కీలకమైన లేడీ విలన్ రోల్‌లో కనిపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తపై ఇప్పటివరకు చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే రాకాలో మొత్తం ఐదుగురు ఫిమేల్ ఆర్టిస్టులు కీలక పాత్రల్లో కనిపించే అవకాశం ఉందట. డైరెక్టర్ అట్లీ ఈ సినిమా కథలో ఇంత మంది స్టార్ హీరోయిన్స్ రోల్స్‌ను ఎలా డిజైన్ చేశారనేది ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తిగా మారింది.

అల్లు అర్జున్ కెరీర్‌లో 22వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. సంస్కృతంలో ‘రాకా’ అనే టైటిల్‌కు ‘పౌర్ణమి’ అనే అర్థం ఉందని సమాచారం. మరోవైపు హీరో క్యారెక్టరైజేషన్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని, మాఫియా నేపథ్యంలో కథ సాగుతుందనే ప్రచారం కూడా జరుగుతుంది. ప్రస్తుతం ‘రాకా’ షూటింగ్ ముంబై పరిసరాల్లో శరవేగంగా జరుగుతోంది. ఇటీవల నటి మంచు లక్ష్మి ఈ సినిమా సెట్స్‌ను సందర్శించినట్లు ఒక వీడియోలో వెల్లడించారు. ఈ సినిమా సెట్స్‌లో ఏర్పాటు చేసిన భారీ, వింత జంతువుల సెట్టింగ్స్ చూసి తాను ఆశ్చర్యపోయినట్లు మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఐశ్వర్య లక్ష్మి ఎంట్రీ, ఆమె పాత్రకు సంబంధించిన వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మేకర్స్ అధికారికంగా స్పందించాల్సిందే. అప్పటివరకు ‘రాకా’లో అసలు అట్లీ ప్లాన్ ఏంటనేది సస్పెన్స్‌గానే ఉండనుంది.