Reading Time: 2 minutes
Ap Liquor Transport Case Karumuri Nageswara Rao Ed Remand Report Money Laundering

AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసుకు సంబంధించి మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం రవాణాలో కొల్లగొట్టిన రూ.11.95 కోట్లు సొమ్ము కారుమురి ఖాతాలోకి వెళ్లినట్లు ఈడీ గుర్తించింది. మద్యం రవాణా కేసులో రూ.18.09 కోట్ల మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ పేర్కొంది. కారుమూరి రాజకీయ పలుకుబడి ఉపయోగించి అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ చెబుతోంది. ఈడీ రిపోర్టులో పేర్కొన్న వివరాల ప్రకారం.. అక్రమంగా కారుమూరి ఖాతాలకు వచ్చిన నగుదుతో అప్పులు తీర్చి, మరికొన్ని స్థిరాస్తులు కొనుగోలు చేశారు. పుట్టినరోజు వేడుకలు, ఖరీదైన వాచీలు కొనుగోలు, విమాన ఛార్జీలన్నీ ఈ ఖాతాలో ఉన్న నగదు తోనే ఉపయోగించారు. లిక్కర్ కేసులో కీలక నిందితుడు రాజ్ కసి రెడ్డికి నెలకు రూ. 50 నుంచి రూ. 60 లక్షలు చెల్లింపులు జరిగాయి. లిక్కర్ రవాణా వ్యవహారంలో కారుమూరి నాగేశ్వరరావుకు 10 నోటీసులు ఇచ్చాం. కేసు దర్యాప్తును అడ్డుకునేందుకే కారుమూరి విచారణకు రాకుండా తప్పించుకొని తిరిగారు. మద్యం రవాణా ద్వారా అక్రమంగా వచ్చిన నగదును తన కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి మళ్లించడంలో కారుమురి కీలక పాత్ర ఉంది. మద్యం రవాణాలో సబ్ కాంట్రాక్టులు ఇప్పించినందుకు లాబాల్లో 50% వాటాలను కారుమూరి వసూలు చేశారు. కొల్లగొట్టిన సత్తును కారుమూరి సునీల్, భార్యకీర్తి, మామ ప్రతాప్ రెడ్డి, తల్లి కారుమురి లక్ష్మీ కిరణ్, సోదరి దీపికా, ఆమె మామ అచ్చప్ప రామూర్తిల బ్యాంక్ అకౌంట్లకు మళ్లించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు.

ఇలా వచ్చిన మొత్తం నగదు ద్వారా మైనింగ్ లీజ్ హక్కులను పొందినట్లు ఈడీ గుర్తించింది. “మద్యం రవాణాలో ఒక్కో మద్యం కేసుపై కిలో మీటర్‌కు 13 రూపాయలు చొప్పున దోచుకున్నారు. సిగ్మా నుంచి తన ముసుగు కంపనీ అయిన సుదర్శన్ కన్ స్ట్రక్షన్ పేరిట కారుమూరి సబ్ కాంట్రాక్టు పొందారు. దాని ద్వారా వచ్చిన ఆదాయంలో 85 శాతం కారుమూరి కుటుంబానికి 15 శాతంసుదర్శన్ కన్ స్ట్రక్షన్ చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. సబ్ కాంట్రాక్ట్ వ్యవహారాలన్నీ కారుమూరి నాగేశ్వరరావు సునీల్ మనుషులే చూసుకునేవారు. సబ్ కాంట్రాక్టులు కట్టబెట్టినందుకు గాను రాజ్ కసి రెడ్డికి ప్రతి నెల రూ.50 నుంచి రూ. 60 లక్షలు చెల్లించారు. సుదర్శన్ కన్ స్ట్రక్షన్ ప్రతినిధి సందీప్ ద్వారా చెల్లింపులు జరిగాయి. ముఠాలోని మిగితా సభ్యుల మధ్య ఆ డబ్బు పంపిణీ జరిగేది.” అని ఈడీ తన రిపోర్టులో పేర్కొంది.