Reading Time: 2 minutes
Nepal Rasuwa Floods Bhotekoshi River Flash Floods Villages

Nepal Floods: నేపాల్‌లోని రసువా జిల్లాను బుధవారం ఉదయం సంభవించిన భీకర వరదలు గ్రామాలను ముంచెత్తాయి. భోటేకోషి నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో ఆ ప్రాంతమంతా కకావికలమైంది. నదీ తీర ప్రాంతాల్లో ప్రశాంతంగా ఉన్న గ్రామాలు క్షణాల్లో జలమయమయ్యాయి. నీటి ప్రవాహం ఏ స్థాయిలో ఉందంటే, ఒడ్డున ఉన్న జనావాసాలు కొట్టుకుపోయి ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు చూస్తేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. స్థానికులు వరద ఉద్ధృతికి ఏ విధంగా కొట్టుకుపోయారో ఊహించుకుంటేనే గుండెలు విసిగిపోతున్నాయి.

ఈ దెబ్బకు రసువా జిల్లాలోని అనేక కీలక ప్రాంతాలు, మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉత్తరగయ గ్రామీణ మునిసిపాలిటీ ఉపాధ్యక్షురాలు చమేలీ గురుంగ్ తెలిపిన వివరాల ప్రకారం.. స్యాఫ్రూబెసి, బెట్రావతి, మైలుంగ్, సల్లెతార్, శాంతిబజార్, పైరేబెసి, ఖాల్తీ బస్తీ, సోలే, త్రిశూలి, బట్టార్ వంటి దాదాపు డజనుకు పైగా గ్రామాలు ఈ హఠాత్ వరద దాటికి గురయ్యాయి. ప్రస్తుతానికి మరణాలు, గాయపడినవారు, ఆస్తి నష్టానికి సంబంధించిన అధికారిక గణాంకాలను ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. అయితే స్థానిక అధికారులు, ప్రజలు, భద్రతా సంస్థల సమాచారం ప్రకారం నష్టం ఊహకందని స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 13 మృతదేహాలను వెలికితీయగా, వెయ్యి మందికి పైగా వరద నీటిలో కొట్టుకుపోయి ఉంటారని తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.

బాధితులను కాపాడేందుకు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. నేపాల్ ఆర్మీ చీఫ్ వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ వల్ల సుమారు 4,000 మందికి పైగా ప్రజలు తీవ్రంగా ప్రభావితులయ్యారు. పరిస్థితి అత్యంత గంభీరంగా మారడంతో నేపాల్ రెడ్ క్రాస్ తన ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లను వెంటనే అప్రమత్తం చేసి, సహాయక చర్యల్లోకి దించింది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ (IFRC) కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. మరోవైపు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలకు దూరంగా వెళ్లి ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని సూచించారు.

సహాయక చర్యల కోసం నేపాల్ ప్రభుత్వం వెంటనే రెండు సైనిక హెలికాప్టర్లను రంగంలోకి దించింది. నేపాల్ ఆర్మీ, ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్, నేపాల్ పోలీసులను సహాయక చర్యల్లో భాగస్వాములను చేశారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఇతర జిల్లాల నుంచి కూడా అదనపు బలగాలను రసువా జిల్లాకు రప్పిస్తున్నారు. వరద తీవ్రతపై హోం మంత్రిత్వ శాఖ అత్యవసర సమావేశం నిర్వహించగా, ప్రధానమంత్రి బాలేంద్ర షా కూడా పరిస్థితులపై ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ముందస్తు జాగ్రత్తగా దేశంలోని 5 జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించి, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.