
September 1 Rules Changes: ఆగస్టు నెల ముగింపునకు వచ్చింది. మరో ఐదు రోజుల్లో సెప్టెంబర్ నెలలోకి అడుగుపెడుతున్నాం. ప్రతి నెలా మొదటి తేదీన మన దైనందిన జీవితంపై ప్రభావం చూపే కొన్ని కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. వచ్చే నెల 1వ తేదీ నుంచి కూడా మన వంటింటి బడ్జెట్ నుంచి విదేశీ ప్రయాణాల వరకు ఎన్నో అంశాల్లో ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి. సెప్టెంబర్ 1న అత్యంత ముఖ్యమైన మార్పు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలకు సంబంధించింది. చమురు విక్రయ సంస్థలు ప్రతి నెల ప్రారంభంలో కొత్త ధరలను ప్రకటిస్తాయి. ఆగస్టు 1న 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.202 తగ్గింపు లభించినప్పటికీ, 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం.
ఇక మీరు ప్రస్తుతం పొందుతున్న సబ్సిడీ లేదా నిరంతర సిలిండర్ సరఫరాను ఎలాంటి అంతరాయం లేకుండా పొందాలంటే మీకో ముఖ్యమైన సూచన. గ్యాస్ ఏజెన్సీలు e-KYC ప్రక్రియను పూర్తి చేయడానికి చివరి తేదీని గతంలో ఉన్న ఆగస్టు 23 నుంచి ఆగస్టు 31 వరకు పొడిగించాయి. ఈ ఐదు రోజుల్లోగా ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ వినియోగదారులు తమ ఇ-కేవైసీ పూర్తి చేయకపోతే, సెప్టెంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్ పంపిణీలో ఇబ్బందులు ఎదురుకావచ్చు లేదా ఎక్కువ ధర చెల్లించాల్సి రావచ్చు. ఎల్పీజీ ధరలతో పాటు వైమానిక ఇంధనం (ATF), సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరల్లో కూడా సెప్టెంబర్ 1న సవరణలు జరగనున్నాయి. ఏటీఎఫ్ ధరల్లో వచ్చే మార్పుల వల్ల విమాన ప్రయాణ ఛార్జీలు మారే అవకాశం ఉంది.
కొత్తగా కారు కొనాలని భావిస్తున్న వారికి సెప్టెంబర్ నెల కాస్త షాక్ ఇవ్వనుంది. ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తమ అన్ని రకాల కార్లు, ఎస్‌యూవీల ధరలను గరిష్టంగా రూ.25,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ధరల పెంపు పెట్రోల్, డీజిల్ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ (EV) మోడళ్లకు కూడా వర్తిస్తుంది. మోడల్, వేరియంట్‌ను బట్టి ఈ పెంపు మారనుంది. టాటాతో పాటు హుండాయ్ మోటార్ ఇండియా కూడా ఈ ఏడాదిలో మూడోసారి తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు వెల్లడించింది. అయితే విదేశీ ప్రయాణాలు చేసే వారికి మాత్రం ఒక శుభవార్త ఉంది. సెప్టెంబర్ 1 నుంచి ఇమ్మిగ్రేషన్ నిబంధనలలో ఊరట లభించనుంది. భారత విమానాశ్రయాల నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులు ఇకపై ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద భౌతిక బోర్డింగ్ పాస్‌పై స్టాంప్ వేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రయాణికులు తమ మొబైల్‌లోని ఎలక్ట్రానిక్ బోర్డింగ్ పాస్ లేదా ప్రింటెడ్ కాపీని చూపించి ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను చాలా సులభంగా పూర్తి చేసుకోవచ్చు.