
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో మంగళవారం పవిత్రోత్సవాల్లో భాగంగా అష్టోత్తర శతకలశాభిషేకం ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి వేదవిన్నపాలు నిర్వహించి ఉత్సవమూర్తులకు కలశాభిషేకం చేశారు. హవనం అనంతరం పవిత్రాలను ప్రత్యేక పూజలు నిర్వహించి మూలవరులతో పాటు లక్ష్మీతాయారు అమ్మవారు, ఆంజనేయస్వామి, భక్త రామదాసు, గోదాదేవి ఉత్సవమూర్తులకు అలంకరించారు.
అనంతరం ఆలయం, ధ్వజస్తంభం, బలిపీఠం, సుదర్శన చక్రం, గోపురంపై ఉన్న ఆకాశరాముడికి పవిత్రాలను ధరింపజేశారు. అర్చకులు కూడా పవిత్రాలను ధరించారు. ప్రధానార్చకులు అమరవాది విజయరాఘవన్, రామస్వరూపాచార్యుల ఆధ్వర్యంలో వైదిక బృందం ఉత్సవాలను నిర్వహించింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.