Reading Time: 1 minute

ప్రైవేటు సంస్థల చేతికి డీఆర్డీఓ క్షిపణి సాంకేతికత: రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

Caption of Image.

భారత రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మరో చారిత్రక నిర్ణయం తీసుకుంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(DRDO) అభివృద్ధి చేసిన అన్ని కన్వెన్షనల్ మిస్సైల్ వ్యవస్థల సాంకేతికతను దేశీయ ప్రైవేటు పరిశ్రమలకు బదిలీ చేయడానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికారికంగా ఆమోదం తెలిపారు. దీని ద్వారా రక్షణ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి పెద్దపీట వేస్తూ సరికొత్త శకానికి శ్రీకారం చుట్టారు.  

ఈ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఒప్పందం ద్వారా అర్హత గల భారతీయ కంపెనీలు దేశీయంగానే క్షిపణులను తయారు చేయడానికి వీలు కలుగుతుంది. విదేశీ ఆయుధ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడంతో పాటు, దేశీయంగా బలమైన డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని నిర్మించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం. నిబంధనలతో పాటు అర్హతలకు లోబడి ప్రైవేటు సంస్థలు ముందుకు వచ్చి అత్యాధునిక ఆయుధాలను ఉత్పత్తి చేసేలా ఈ విధానం వెసులుబాటు కల్పిస్తుంది.  

ఈ చారిత్రక పరిణామం కేవలం పెద్ద కంపెనీలకే కాకుండా.. ఎంఎస్ఎంఈలు, ఇతర సాంకేతిక భాగస్వాములకు సైతం సరఫరా గొలుసులో భాగస్వామ్యం కల్పించనుంది. డీఆర్డీఓ వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పారిశ్రామిక ఉత్పత్తిగా విజయవంతంగా మార్చడానికి ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు రక్షణ రంగంలో ఉపాధి అవకాశాలను కూడా భారీగా పెంచనుంది.  

ఇటీవల కాలంలో రక్షణ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు డీఆర్డీఓ వరుస చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే భవిష్యత్తులో జరిగే ఆయుధాల అభివృద్ధి, ఉత్పత్తి కాంట్రాక్టులలో ప్రైవేటు సంస్థలను భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా భారతీయ వాయుసేన అవసరమైన విడిభాగాల్లో ఇప్పటికే 97 శాతం మేర స్వదేశీకరణ సాధించడం కీలక విజయం.  

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రక్షణ దిగుమతుల నిషేధ జాబితా, తాజా సాంకేతిక బదిలీ నిర్ణయాలు భారత్‌ను గ్లోబల్ డిఫెన్స్ హబ్‌గా మార్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ప్రైవేటు రంగానికి మిస్సైల్ టెక్నాలజీని అందించడం ద్వారా రాబోయే రోజుల్లో భారత్ రక్షణ ఎగుమతుల్లో అఖండ విజయాలను సాధించే దిశగా వేగంగా అడుగులు వేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

©️ VIL Media Pvt Ltd.