
Jai Jawan Jai Kisaan Tattoo: శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇది అతడి టెస్టు కెరీర్‌లో రెండో శతకం. సెంచరీ అనంతరం జురెల్ తన బైసెప్‌పై ఉన్న ‘జై జవాన్.. జై కిసాన్’ టాటూను చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ టాటూ వెనుక తన కుటుంబ మూలాలు ఉన్నాయని జురెల్ వెల్లడించాడు.
‘మా తాత రైతు. నాన్న సైన్యంలో పనిచేశారు. నా జీవితానికి, కుటుంబ నేపథ్యానికి వారే మూలం. వారిని ఎప్పటికీ మర్చిపోవద్దనే ఉద్దేశంతోనే ఆ టాటూను వేయించుకున్నా. కొలంబో టెస్టులో సెంచరీని నా తండ్రి, తాతకు అంకితం చేశాను. శ్రీలంకలో ఇంతకుముందు భారత్-ఎ జట్టుతో కలిసి రెండు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడటం నాకు ఎంతో ఉపయోగపడింది. అక్కడి పరిస్థితులు, పిచ్‌ల స్వభావంపై ఇప్పటికే అవగాహన ఉండటంతో కొలంబో టెస్టులో సులువుగా బ్యాటింగ్ చేశాను. పరిస్థితులను అంచనా వేసుకుంటూ భాగస్వామ్యాలు నిర్మించడమే మా వ్యూహం. కెప్టెన్, కోచ్ ఎప్పుడూ పరిస్థితులకు అనుగుణంగా ఆడాలని సూచిస్తారు. అందుకే బంతి, పరిస్థితిని బట్టి ఆటను మార్చుకుంటూ సానుకూలంగా బ్యాటింగ్ చేశా’ అని ధ్రువ్ జురెల్ వివరించాడు.
ధ్రువ్ జురెల్ శతకం చేసిన సమయంలో అప్పుడు క్రీజులో ఉన్న మహ్మద్ సిరాజ్ ఉత్సాహం కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది. దీనిపై స్పందించిన జురెల్.. సిరాజ్ సాధారణంగానే సెంచరీ చేసిన బ్యాటర్ కంటే ఎక్కువగా సంబరాలు చేసుకుంటాడని సరదాగా చెప్పాడు. ‘నేను బ్యాటింగ్ చేస్తూ ఉన్నప్పుడు సిరాజ్ మరో వైపు అద్భుతంగా డిఫెన్స్ చేశాడు. అతడి బ్యాటింగ్ చూసి ముచ్చటేసింది. భారత్ తరఫున ఆడుతున్నప్పుడు పూర్తిగా ఒత్తిడి లేకుండా ఉండటం సాధ్యం కాదు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉన్నప్పటికీ.. ప్రతి ఇన్నింగ్స్ ప్రారంభంలో ఒకరకమైన ఉత్కంఠ ఉంటుంది’ అని చెప్పాడు.
మ్యాచ్‌లో సెంచరీ సాధించినప్పటికీ మరుసటి రోజు తాను మళ్లీ సున్నా పరుగుల నుంచే ప్రారంభించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. తొలి 20-25 బంతులు ఆడే సమయంలోనే చాలా ఆలోచనలు మనసులో తిరుగుతాయని, ఆ ఫీలింగ్ ఎప్పటికీ ఉంటుందని జురెల్ చెప్పాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రెండో రోజు చివరి సెషన్‌లో భారత్ 475/8 స్కోరు నుంచి బ్యాటింగ్ కొనసాగించింది. జురెల్ 95 పరుగులతో, మహ్మద్ సిరాజ్ సున్నాతో క్రీజులో ఉన్నారు. చివరకు 171 బంతుల్లో తొమ్మిది ఫోర్లతో తన రెండో టెస్టు సెంచరీని పూర్తి చేశాడు. 99 నుంచి 100 పరుగులకు చేరుకునే క్రమంలో 13 డాట్‌బాల్స్ ఆడిన జురెల్.. శతకం పూర్తయిన వెంటనే అసిత ఫెర్నాండో బౌలింగ్‌లో లాంగ్‌ఆన్‌పై భారీ సిక్సర్ కొట్టాడు. అనంతరం మరో సిక్సర్‌తో తన దూకుడు కొనసాగించాడు.
మహ్మద్ సిరాజ్ 29 బంతుల్లో 3 పరుగులు చేసి ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత ప్రసిధ్ కృష్ణ సహకారంతో భారత్ 500 పరుగుల మార్క్‌ను దాటింది. చివరకు టీమిండియా 503/9 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. జురెల్ 115 పరుగులతో నాటౌట్‌గా, ప్రసిధ్ కృష్ణ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. 503 పరుగుల భారీ స్కోరుకు బదులుగా బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. లాహిరు ఉదారా 1 పరుగుకే యశస్వి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వెలుతురు తగ్గడంతో భారత్ స్పిన్నర్లను రంగంలోకి దించింది. ఈ సమయంలో మానవ్ సుతార్ మరోసారి తన మ్యాజిక్ చూపించాడు. ప్రభాత్ జయసూర్యను కేవలం 2 పరుగులకే ఎల్‌బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. దీంతో శ్రీలంక 8 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి లంక 8/2 స్కోరుతో నిలిచింది. మూడో రోజు రెండో సెషన్లో లంక వికెట్ల నష్టానికి 139 రన్స్ చేసింది.