Reading Time: < 1 minute

కేంద్ర మంత్రుల ఇండ్ల రిపేర్లకు ఏడాదిలో రూ.92 కోట్లు

Caption of Image.

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని లూటియన్స్ బంగ్లా జోన్‌‌‌‌లో ఉన్న కేంద్ర మంత్రుల అధికారిక నివాసాల మరమ్మతుల కోసం 2025–26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 92.35 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ఆర్టీఐ ద్వారా ఈ విషయాలు వెలుగుచూశాయి. 2014-–15లో ఈ ఖర్చు 27.47 కోట్లు మాత్రమే ఉండగా ప్రస్తుతం మూడురెట్లు పెరిగింది. సీపీడబ్ల్యూడీ ఆధ్వర్యంలో 2014-–15 నుంచి 2025-–26 మధ్య ఈ పనుల కోసం మొత్తం రూ.547.68 కోట్లు వెచ్చించారు. 

గోడల నుంచి నీరు కారడం, చెదపట్టడం, విద్యుత్, ప్లంబింగ్ సమస్యల కారణంగా ఖర్చులు భారీగా పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ బంగ్లాలు 80 నుంచి 100 ఏళ్ల కిందటివి కావడంతో కొన్ని శిథిలావస్థకు చేరాయి. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రుల సంఖ్య సాధారణంగా 70 నుంచి 72 వరకు ఉంటోంది. గత ఆర్థిక సంవత్సరంలో వెచ్చించిన నిధుల ఆధారంగా లెక్కిస్తే, ఒక్కో మంత్రి నివాసానికి సగటున సుమారు 1.2 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఫ్యాన్లు, ఎల్ఈడీ లైట్ల మార్పులు, ప్లంబింగ్ పనులు, ఫ్లోరింగ్ టైల్స్​ రిపేర్ల కోసమే ఈ నిధులు ఎక్కువగా వినియోగిస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు.
 

©️ VIL Media Pvt Ltd.