
వర్షాలకు సిటీలో రోడ్లన్నీ మునిగిపోవడం, డ్రైనేజీలు జామ్ కావడం మొదలైన సమస్యలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భంలో.. ఎంపీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సిటీ మునుగుతుందా.. 2047 వరకు ఆగండి.. అంతా సెట్ చేస్తామని చేసిన కామెంట్స్ పై ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హర్యానలోని గుర్గాం సిటీ ముంపుపై బీజేపీ ఎంపీ ధరంవీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ప్రభుత్వం మిలీనియమ్ సిటీ కోసం మౌలిక సదుపాయాలు కల్పిస్తోందని అన్నారు. కష్టపడి పనిచేస్తే నీళ్లు నిలవటాలు, ట్రాఫిక్ జామ్ ఉండదన్నారు.
వర్షాలు సడెన్ గా కురుస్తున్నాయి.. సిటీ ఇంత పెరుగుతుందని ఊహించలేదు.. జనాభా పెరిగిపోయారు.. కార్లు పెరిగాయి.. ఈ సిటీకి ప్లాన్ 60 ఏండ్ల క్రితం వేశారు.. అందుకే సరిపోవటం లేదు.. 2047 వరకు ఆగండి.. మొత్తం మార్చేస్తాం.. సిటీ ముంపుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి లోపం లేదు.. అంటూ కామెంట్ చేశారు. జనాలు ఓవైపు చావు బతుకుల మధ్య ఉంటే ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడతారా అని విమర్శలు చేస్తున్నారు ప్రజలు.
దీనికి తోడు సిటీ ముంపుకు కారణం కాంగ్రెస్ పార్టీనేనని ఆయన చేసిన వ్యాఖ్యలుపై సోషల్ మీడియాలో విమర్శలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్నారు కదా.. వరుసగా మీరే గెలుస్తున్నారు కదా.. అయినా సమయం సరిపోవటం లేదా సిటీని బాగుచేసేందుకు అంటూ ప్రశ్నిస్తునారు. ప్రభుత్వ లోపాన్ని ప్రతిపక్షాలపై నెట్టివేయడమేంటని మండి పడుతున్నారు.