
ఉదయం 5 గంటలు.. ఖరీదైన ఫార్చూనర్ కారు వచ్చి రోడ్డుపై ఆగింది. అందులో నుంచి ఓ వ్యక్తి దిగాడు. చేతిలో చీపురు పట్టుకుని రోడ్లు శుభ్రం చేయడం ప్రారంభించాడు. మధ్యాహ్నం 12 గంటల వరకు విధులు నిర్వహించిన ఆయన.. పని పూర్తయ్యాక చీపురును పక్కన పెట్టి మళ్లీ అదే ఫార్చూనర్‌లో ఇంటికి వెళ్లిపోయాడు. ఈ దృశ్యం చూసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఆయన ఎవరో కాదు.. కర్ణాటకలోని బంట్వాళకు చెందిన పారిశుధ్య కార్మికుడు శేషప్పణ్ణ.
రూ.50 కూలీతో మొదలైన ప్రస్థానం..
శేషప్పణ్ణ 1996లో రోజుకు కేవలం రూ.50 కూలీతో పౌర పారిశుధ్య కార్మికుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. కొంతకాలానికి ఆయన ఉద్యోగం పర్మినెంట్ అయింది. మూడో తరగతి వరకు మాత్రమే చదువుకున్న శేషప్పణ్ణ.. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. ఓ దశలో మద్యానికి బానిసై తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే 2005లో అప్పటి బంట్వాళ ఎస్ఐ బెళ్లియప్ప ఇచ్చిన స్ఫూర్తితో మద్యాన్ని పూర్తిగా మానేశారు. అదే ఆయన జీవితంలో కీలక మలుపుగా మారింది.
ఉదయం పారిశుధ్య పని.. మధ్యాహ్నం పశువుల పెంపకం
ప్రస్తుతం శేషప్పణ్ణ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పారిశుధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత పశువుల పెంపకంపై దృష్టి సారిస్తున్నారు. ఈ వ్యాపారం ద్వారా నెలకు సుమారు రూ.40 వేల వరకు అదనపు ఆదాయం వస్తోందని ఆయన చెబుతున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బుతో తనకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తూ వచ్చారు.
ఆల్టో నుంచి ఫార్చూనర్ వరకు..
తొలుత శేషప్పణ్ణ ఒక ఆల్టో కారు కొనుగోలు చేశారు. అప్పట్లో కొందరు.. “పారిశుధ్య కార్మికుడికి కారు ఎందుకు?” అంటూ ఎగతాళి చేశారు. కానీ ఆయన విమర్శలను పట్టించుకోకుండా ముందుకు సాగారు. ఆ తర్వాత మరో కారు కొనుగోలు చేశారు. పాత కారును విక్రయించడం, అవసరమైన మేరకు లోన్ తీసుకోవడం ద్వారా క్రమంగా తన కలలను నెరవేర్చుకుంటూ వచ్చారు. తాజాగా తనకు ఎంతో ఇష్టమైన ఖరీదైన ఫార్చూనర్ కారును కొనుగోలు చేశారు.
“ఏ పని చేస్తున్నామన్నది కాదు.. గౌరవంగా చేయడమే ముఖ్యం”
తన జీవితాన్ని గుర్తు చేసుకుంటూ శేషప్పణ్ణ ఆసక్తికర విషయాలు చెప్పారు. జీవితంలో ఎన్నో తప్పులు చేశానని, మద్యానికి బానిసై చాలా కోల్పోయానని తెలిపారు. ఒకానొక సమయంలో తన తండ్రి అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా చేతిలో డబ్బులు లేని పరిస్థితి ఎదురైందని గుర్తు చేసుకున్నారు. అయితే కష్టాల నుంచి పాఠాలు నేర్చుకుని, జీవితాన్ని మార్చుకున్నానని చెప్పారు. పని చిన్నదా, పెద్దదా అనేది ముఖ్యం కాదని.. మనం చేసే పనిని నిజాయితీగా, గౌరవంగా చేయడమే అసలైన గొప్పతనమని ఆయన అంటున్నారు.
విధుల్లో నిజాయితీ.. జీవితంలో ఆత్మవిశ్వాసం..
ఫార్చూనర్ కారులో వచ్చి రోడ్లు ఊడ్చే శేషప్పణ్ణ వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఆసక్తిని రేపుతున్నాయి. ఖరీదైన కారు ఉండటం మాత్రమే గొప్పతనం కాదని, ఎలాంటి పని చేసినా దాన్ని గౌరవంగా చేయడమే అసలైన విజయం అని ఆయన తన జీవితంతో నిరూపిస్తున్నారు.
రూ.50 రోజువారీ కూలీతో ప్రారంభమైన ప్రయాణం.. నేడు ఫార్చూనర్ కారులో ప్రయాణించే స్థాయికి చేరింది. అయినప్పటికీ తన పారిశుధ్య పనిని వదలకుండా, అదే గౌరవంతో కొనసాగిస్తున్న శేషప్పణ్ణ జీవితం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.