
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ఫ్యాన్స్ నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ తర్వాత ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్‌స్టర్ రివేంజ్ డ్రామా ‘టాక్సిక్’ ఈరోజు ( ఆగస్టు 26, 2026 ) థియేటర్లలోకి అడుగుపెట్టింది. తొలి షో నుంచే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. విడుదలైన రోజున కూడా టికెట్ సేల్స్‌లో అదే జోరు కొనసాగిస్తోంది.
గంటలోనే లక్ష టికెట్లు సెల్..
బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ వంటి ప్రధాన టిక్కెటింగ్ యాప్స్‌లో కేవలం గంట వ్యవధిలోనే లక్షకు పైగా టికెట్లు అమ్ముడవ్వడం యశ్ క్రేజ్‌కు అద్దం పడుతోంది. విడుదలకు ముందే బుక్‌మైషోలో ‘టాక్సిక్’ 6.83 లక్షలకు పైగా టికెట్లు విక్రయించి ఆల్‌టైమ్ టాప్ అడ్వాన్స్ సేల్స్ జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. ‘కల్కి 2898 ఏడీ’, ‘జైలర్’ వంటి సినిమాలను కూడా ఈ విషయంలో వెనక్కి నెట్టింది. ఈ సినిమా రిలీజ్ రోజే .. హాలిడే కావడంతో కలెక్షన్స్ పరంగా మరింత ప్లస్ గా మారింది.
తొలి రోజే రూ.100 కోట్ల క్లబ్ లో..
ఇక థియేటర్లలో పరిస్థితి మరింత క్రేజీగా ఉంది. కర్ణాటకతో పాటు హిందీ బెల్ట్‌లోనూ భారీ ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే డబ్బింగ్ సినిమాకు ఊహించని స్థాయిలో స్పందన కనిపిస్తోంది. తొలి షో నుంచే హౌస్‌ఫుల్ బోర్డులు పడుతున్నాయి. దేశవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే 18 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు నివేదికలు చెబుతున్నాయి. ‘కాంతార’ వంటి పాన్-ఇండియా హిట్ల రికార్డులను తిరగరాస్తూ, తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ సుమారు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందింది. కెవిఎన్ ప్రొడక్షన్స్ , మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్ కె నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా వంటి భారీ తారాగణం నటించింది.
ALSO READ : ‘టాక్సిక్’ మూవీలో స్టయిల్ ఎక్కువ..
థియేటర్లలో పూనకాలు..
ఈ చిత్రంలో యశ్ ద్విపాత్రాభినయం, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ, జెజె పెర్రీ , అన్బరీవ్ అందించిన యాక్షన్ కొరియోగ్రఫీ సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాయి. రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి యాక్షన్ సీన్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. తండ్రీకొడుకుల మధ్య వచ్చే హై-వోల్టేజ్ క్లైమాక్స్ ఫైట్ థియేటర్లలో ప్రేక్షకుల చేత ఈలలు వేయిస్తోంది.
హిందీ బెల్ట్‌తో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోనూ తెల్లవారుజాము నుంచే షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక డబ్బింగ్ సినిమాకి ఈ స్థాయి ఆక్యుపెన్సీ లభించడం అరుదైన విషయం. సరైన మాస్ ప్రాజెక్ట్ పడితే బాక్సాఫీస్ బొమ్మ ఎలా ఉంటుందో ‘టాక్సిక్’ మరోసారి నిరూపించింది. ఈ వారాంతానికి ఈ చిత్రం మరిన్ని కొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయం అని సినీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.